లే అవుట్లను తలదన్నేలా!

Ongoing work with employment guarantee funds - Sakshi

పేదల ఇళ్ల స్థలాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 9,100 ఎకరాల్లో భూమి చదును

ఉపాధి హామీ నిధులతో కొనసాగుతున్న పనులు

9,633 గ్రామాల్లో ఇప్పటికే మొదలు

ఎకరానికి గరిష్టంగా 800 మీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణం

సమీప గ్రామాలు/రోడ్డుతో అనుసంధానించేలా ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: అందమైన లే–అవుట్లు.. విశాలమైన అంతర్గత రోడ్లు... ప్లాట్ల దగ్గరి నుంచి సమీప గ్రామానికి లింకు రోడ్డు...! ఇదేదో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వ్యాపార ప్రకటన కాదు... రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలివి. 

ఉగాది సందర్భంగా గూడులేని పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను తలదన్నేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 9,100 ఎకరాల్లో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు 25 లక్షల మంది పేదలకు ఉగాదికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గతానికి భిన్నంగా ఇంటి పట్టా పొందిన లబ్ధిదారుడు వెంటనే గృహ నిర్మాణం ప్రారంభించేలా భూమిని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో లే అవుట్‌ పనులు ఊపందుకున్నాయి.

గ్రామాల్లో ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన భూముల వివరాలను రెవిన్యూ శాఖ సర్వే నంబర్ల వారీగా గ్రామీణాభివృద్ధి శాఖకు తెలియజేసిన వెంటనే ఉపాధి హామీ నిధులతో చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఆయా చోట్ల పరిస్థితిని బట్టి ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ పనుల కోసం ఖర్చు చేస్తున్నారు.

నెలాఖరుకు భూమి చదును, రోడ్లు పూర్తి
- గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల కోసం రెవిన్యూ శాఖ ఇప్పటి వరకు 12,843 ప్రాంతాల్లో గుర్తించిన భూమి వివరాలను గ్రామీణాభివృద్ది శాఖకు అందజేయగా ఎలాంటి అభ్యంతరాలు లేని 9,633 గ్రామాల్లో చదును చేయడం మొదలైంది.
ముళ్ల పొదలు లాంటివి తొలగింపు పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. 
- భూమి చదును చేయడం, మెరక తోలడం, లే అవుట్‌ ప్రకారం రోడ్ల నిర్మాణానికి డ్రోన్లను వినియోగించారు. 
ప్రతి ఎకరాకు గరిష్టంగా 4,000 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించి భూమి చదును చేస్తున్నారు.
- ప్రతి ఎకరానికి గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. 
ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూమి నుంచి సమీపంలోని రోడ్డు లేదా గ్రామం వరకు గరిష్టంగా 5 కి.మీ పొడవున లింకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. 
- భూమి చదును, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆ భూమిని తిరిగి రెవిన్యూ శాఖకు అప్పగిస్తే లే అవుట్‌ ప్రకారం ప్లాట్ల వారీగా రాళ్లు పాతుతారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. 
- రాష్ట్రవ్యాప్తంగా 8,662 గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top