
అరకులోయ గ్రామం వ్యూ
సాక్షి, విశాఖపట్నం : ఆ గ్రామం మండల కేంద్రం కాదు. కనీసం పంచాయతీ కూడా కాదు. ఓ మేజర్ పంచాయతీలోని ఆవాస గ్రామం. కానీ, నేడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రంగా గుర్తింపు పొందింది. అదే... అరకు. ప్రకృతి ప్రత్యేకతలతో రాష్ట్రంలో, దేశంలోనే పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లే అరకును విశాఖలో అడుగుపెట్టే దేశ, విదేశ పర్యాటకులు చూడకుండా వెళ్లరనే చెప్పాలి. చిత్రమేమంటే ఈ గ్రామానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయం, యంత్రాంగమూ లేదు.
2009కు ముందు అనంతగిరి, అరుకులోయ మండలాలు ఎస్.కోట (ఎస్టీ) నియోజకవర్గంలో ఉండేవి. ఎస్.కోట అసెంబ్లీ స్థానం విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అరకు లోయ కేంద్రంగానే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మేజర్ పంచాయతీలే మండల, నియోజకవర్గ కేంద్రాలుగా ఉంటాయి. వాటిపేరిటే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఇవేవీ లేకుండానే అరకు తన విశిష్టతను మరోసారి చాటుకోవడం గమనార్హం.