ఇక ఎస్‌ఐల వంతు? | Sakshi
Sakshi News home page

ఇక ఎస్‌ఐల వంతు?

Published Sun, Aug 31 2014 2:36 AM

ఇక ఎస్‌ఐల వంతు? - Sakshi

  • ఇసుక వివాదంలో ముగ్గురిపై వేటు పడే అవకాశం!
  •  ‘కొత్త పాలసీ’పై మాఫియా కన్ను!
  •  డ్వాక్రాల మాటున వ్యవహారం
  • చోడవరం: ఇసుక మాఫియాకు సహకరించిన పోలీసు అధికారులపై ఓ పక్క వేటుపడుతుండగా మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇసుక కొత్త విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే చోడవరంతో పాటు జిల్లాలో అనకాపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, మాడుగుల, యలమంచిలి, రాంబిల్లి, కోటవురట్ల పలుచోట్ల ఇసుకు అక్రమ రవాణా జరుగుతోంది.

    దీనిపై వారం రోజుల కిందట జిల్లా ఎస్పీ కె.ప్రవీణ్ ఆకస్మిక దాడులు చేయడం, చోడవరం సర్కిల్ ఇనస్పెక్టర్‌ను సస్పెండ్ చేయడం విదితమే. ఇసుక మాఫియాకు సానుకూలంగా ఉన్నారంటూ చోడవరం, బుచ్చెయ్యపేట, దేవరాపల్లి పోలీసు సబ్ ఇనస్పెక్టర్లతోపాటు చోడవరం పోలీసు స్టేషన్‌లో ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను ఎస్పీ విచారించినట్టు తెలిసింది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం.
     
    ‘ఇసుక విధానం’పై మాఫియా కన్ను

    ఈ పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చే విధానంగా నిర్ణయం తీసుకోవడంతో మాఫియా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయక్చుజీ అక్రమ ఇసుక క్వారీల నిర్వహణ, రవాణా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో మాఫియా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అన్ని విధాలా పావులు కదుపుతోంది.
     
    డ్వాక్రా సంఘాలకు ఇసుక తవ్వకాలు అప్పగించడం మంచిదే అయినప్పటికీ ఏ సంఘాలకు , ఎలాంటి ప్రాతిపదికన ఇస్తారన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. బంగారంగా మారిన ఇసుక నుంచి కాసులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు నాయకులు తమకు అనుకూలంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు ఇసుక ర్యాంపుల నిర్వహణ వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పుడే తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఈ మాఫియా తిరుగుతున్నట్టు సమాచారం.
     
    విజిలెన్స్ దాడులు

    చోడవరం: చోడవరం పరిసరాల్లో ఇసుక ర్యాప్‌లపై భూగర్బ గ నుల శాఖ విజిలెన్స్ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.   గౌరీపట్నం, లక్కవరంలో పెద్దేరు, శారద నది ప్రాంతాల్లో తనిఖీచేసింది. నిల్వ ఉంచిన  20 ఇసుకు కుప్పలను సీజ్‌చేసింది. విజిలెన్స్ అధికారులు ఎస్.టి.కె. మల్లేశ్వరరావు, ఆర్‌ఐ రవికుమార్, చోడవరం ఆర్‌ఐ భారతి, గ్రామ రెవెన్యూ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.  
     

Advertisement
Advertisement