అన్యోన్యమైన ఆ జంటపై విధికి కన్నుకుట్టినట్టుంది. అప్పటి వరకు స్కూటర్‌పై మాట్లాడుకుంటూ వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Aug 29 2013 1:28 AM | Updated on Aug 30 2018 3:56 PM
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: అన్యోన్యమైన ఆ జంటపై విధికి కన్నుకుట్టినట్టుంది. అప్పటి వరకు స్కూటర్‌పై మాట్లాడుకుంటూ వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భార్య కళ్లెదుటే భర్త మృత్యువాతపడ్డాడు. స్కూటర్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భార్యకు గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని యంనంపేట్ చౌరస్తా వద్ద బైపాస్‌రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మైసమ్మగుట్ట కాలనీలో వెంకటేష్(35), శారద దంపతులు ఉంటున్నారు. వెంకటేష్ రాళ్లు కొడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నంతలో దంపతులు హాయిగా, అన్యోన్యంగా ఉంటున్నారు.
బుధవారం వారు నగరంలో ఉన్న బంధువుల ఇంటికి స్కూటర్‌పై బయలు దేరారు. మార్గంమధ్యలో యనంపేట చౌరస్తా వద్ద బైపాస్ రోడ్డులో ఉన్న మలుపులో వెనుక నుంచి వచ్చిన కారు వీరి స్కూటర్‌ను ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. శారదకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కళ్లెదుటే భర్త దుర్మరణం పాలవడంతో శారద షాక్‌కు గురైంది. ఆమె రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తులో ఉంది.
Advertisement
Advertisement