వృద్ధాప్యంలో ఆదరించేది ఆడపిల్లలే | oldage in helps the Daughters | Sakshi
Sakshi News home page

వృద్ధాప్యంలో ఆదరించేది ఆడపిల్లలే

Jul 12 2014 12:47 AM | Updated on Mar 21 2019 8:35 PM

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించేది ఎక్కువగా ఆడపిల్లలేనని, అందువల్ల లింగవివక్ష చూపించి వారిని చిన్న చూపుచూడవద్దని కలెక్టర్ నీతూ ప్రసాద్ హితవు పలికారు.

 కాకినాడ క్రైం : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించేది ఎక్కువగా ఆడపిల్లలేనని, అందువల్ల లింగవివక్ష చూపించి వారిని చిన్న చూపుచూడవద్దని కలెక్టర్ నీతూ ప్రసాద్ హితవు పలికారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి, కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ ఆడపిల్లలను ఆదరించేందుకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్క ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న భార్యాభర్తలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
 
వైద్య శాఖపై ప్రశంసల జల్లు : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో వైద్యసిబ్బంది కృతకృత్యులయ్యారని కలెక్టర్ ప్రశంసించారు. గతేడాది 34 శాతం మంది మాత్రమే ప్రసవాలకోసం ప్రభుత్వాస్పత్రులకు రాగా ఈ ఏడాది అది 46 శాతానికి పెరిగిందన్నారు. ఐసీడీఎస్, వైద్య శాఖ సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. వేసక్టమీ విభాగంలో తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  
 
ఐదు సీహెచ్‌సీల్లో స్కానింగ్ యంత్రాలు  : గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు కార్పొరేట్ సంస్థల సీఎస్‌ఆర్ నిధులతో జిల్లాలోని 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచ్‌సీ)లో ఇప్పటికే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశామని, ఏజెన్సీలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. తొలుత డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నర్సింగ్ విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు  ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ నీతూ ప్రసాద్ జండా ఊపి ప్రారంభించారు.
 
సమావేశం అనంతరం వైద్య సేవల్లో ప్రతిభ కనబరిచిన వారికి, లక్కీడిప్ ద్వారా ఎంపికైన జంటలకు కలెక్టర్ నీతూ ప్రసాద్ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం. పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏజేసీ మార్కండేయులు, డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎంజే నిర్మల, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ ఎం. ప్రసన్న కుమార్, జవహర్ బాల ఆరోగ్య రక్ష కో-ఆర్డినేటర్ డాక్టర్ అనిత, జిల్లా ఫైలేరియా నియంత్రణాధికారి డాక్టర్ పి. శశికళ, సెట్రాజ్ సీఈఓ శ్రీనివాసరావు, సమాచార శాఖ ఏడీ ఫ్రాన్సిస్, డెమో ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement