కుంటనూ వదలరు.. దారినీ వదలరు

Occupying Field In Prakasam - Sakshi

లింగన్నకుంటలో ఆక్రమణలు

పైనున్న పొలాలకు వెళ్లడానికి మిగిలిన ఒకే ఒక్క ఆధారం

కట్ట బలహీన పడి తెగితే దిగువ పొలాలకు ముంపు

ప్రశ్నించిన వారిపై కేసుల బెదిరింపులు

సాక్షి, నాగులుప్పలపాడు (ప్రకాశం): గతంలో ఏర్పడిన ఎన్నో కరువులకు, నీటి ఎద్దడులకు తట్టుకొని పొలాలు, మూగ జీవాలకు నిరంతరంగా నీరు అందించిన కుంట అది. కాలక్రమంలో ఆక్రమణలకు గురై నేడు పక్కనున్న పొలాల రైతులకు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం ఇది. మండలంలోని మాచవరం గ్రామంలోని సర్వే నంబరు 74 లో మెత్తం 13.71 సెంట్లులో లింగన్నకుంట ఉండేది. ఈ కుంట చుట్టు పక్కల పొలాల రైతులకు నీటి వసతి కోసం చాలా అనువుగా ఉండేది. అయితే ఇది కాలక్రమంలో ఆక్రమణలకు గురై నేడు నీటి జాడలు ఉన్నయనడానికే పరిమితమయింది.

ఈ సర్వే నంబరులో మొత్తం వీస్తీర్ణంలో కొంత భాగం రిటైర్డు ఆర్మీకి కేటాయించారు. మిగిలిన భాగంలో ఆక్రమణలకు గురయింది. అది అంతటితో కాకుండా చివరకు కుంట కట్టలను కూడా దున్నేసి పొలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కుంటకు ఆవల వైపునున్న పొలాలకు వెళ్లడానికి ఈ కుంట కట్ట మీద గుండానే వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నకట్టను కూడా ఆక్రమించి కలుపుకుపోతే చేలల్లోకి వెళ్లడానికి మార్గం ఏదని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించే పరిస్థితికి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ ఆక్రమణ ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో వర్షాలు పడి కుంట నిండితే కట్ట తెగితే నీరంతా పంట పొలాలలోనే ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇకనైనా అక్రమలు తొలగించి రైతులు పొలాలకు వెళ్లే మార్గంతో పాటు నీటి ఎద్దడిని తీర్చడానికి కుంట విస్తీర్ణం మెత్తాన్ని సరిచేసి కాపాడాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కారం చూపిన మరలా ఇప్పుడు సమస్యలు ఉత్పన్నమవడం భాధాకరంగా ఉందని వాపోతున్నారు. ఇదే విషయమై తహశీల్దార్‌ను వివరణ కోరగా మాచవరం గ్రామంలో లింగన్నకుంటకు సంబంధించి ఆక్రమణల విషయంలో పూర్తి స్థాయిలో విచారించి ఎవరికి ఆటంకం లేకుండా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

దారిని కూడా వదలడం లేదు..
మా పొలాలకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం కుంట కట్ట మీద గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఈ కట్టను కూడా ఆక్రమించేస్తే ట్రాక్టర్లు కాదు కదా కనీసం మోటారు సైకిళ్లు కూడా పొలాల వద్దకు పోలేవు. ఇకనైనా ఈ సమస్యను పరిష్కరంచాలని కోరుతున్నాం. 
–ఇనగంటి రాఘవ రెడ్డి, రైతు

భయపెడుతున్నారు..
లింగన్న కుంట ఆక్రమణల గురించి ఇప్పటికే పలు సార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. చివరకు కట్ట కూడా ఆక్రమణలకు గురయ్యే పరిస్థితుల్లో కట్ట అవసరత గురించి అడిగితే అక్రమ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడని పరిస్థితుల్లో ఉన్నారు.     
–కోడెల నెహ్రూ, రైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top