సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వేధింపులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అక్రమ కేసులో వల్లభనేని వంశీకి అండగా న్యాయ పోరాటం చేసిన మహిళా న్యాయవాది అనూగీతపై కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. తుమ్మల రామకృష్ణ అనే వ్యక్తి అనూగీత స్థలంలో రాత్రికి రాత్రే గోడ నిర్మాణం చేపట్టాడు. దీంతో, ఆమె తరఫు వ్యక్తులు ప్రశ్నించగా పోలీసులు బెదిరింపులకు దిగడం గమనార్హం. విజయవాడ పోలీసులు సివిల్ పంచాయతీలు చేశారు. దీంతో, బాధితురాలు.. సీపీ రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశారు.
వివరాల ప్రకారం.. విజయవాడలోని వెటర్నరీ కాలనీలో ప్లాట్ నెంబర్ 405లో న్యాయవాది అనూగీత (70) నివాసం ఉంటున్నారు. తాజాగా అనూగీత ఉంటున్న స్థలం సరిహద్దుల్లో ఆమె మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల రామకృష్ణ అనే వ్యక్తి అనూగీత సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడి 30 చదరపు గజాలు భూమిని ఆక్రమించారు. రాత్రి రాత్రే ఆమె స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు. దీంతో, ఇదేం పద్దతి అని అనూగీత ఇంట్లో పనిచేస్తున్న మహిళ రామకృష్ణను నిలదీశారు. అనంతరం, రామకృష్ణ తరఫున మాచవరం పోలీసులు రంగంలోకి దిగారు. ఏసీపీ దామోదర్ ఆదేశాలతో పోలీసులు అనూగీత ప్లాట్‌లోకి వెళ్లి పని మనిషి, ఆమె భర్తతో అనుచితంగా ప్రవర్తించారు.
మహిళ అని కూడా చూడకుండా కానిస్టేబుల్ అమెను దుర్భాషలాడాడు. వంద రూపాయలు ఇస్తే పక్కకు పోయే దానివి అంటూ అసభ్యంగా దూషించాడు. ఈ విషయాన్ని ఆమె.. అనూగీత దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అనూగీత ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామకృష్ణకు వత్తాసు పలకడమేంటని ప్రశ్నించారు. దీంతో, తమకు న్యాయం చేయాలని అనూగీత.. పోలీస్ కమిషనర్‌తో పాటు కోర్టును ఆశ్రయించారు. మాచవరం పోలీసులు కక్ష సాధింపుతోనే ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.


