మూన్నాళ్ల ముచ్చటే..! | NTR Bharosa Scheme Delayed In YSR kadapa | Sakshi
Sakshi News home page

మూన్నాళ్ల ముచ్చటే..!

Oct 1 2018 1:39 PM | Updated on Oct 1 2018 1:39 PM

NTR Bharosa Scheme Delayed In YSR kadapa - Sakshi

సాక్షి కడప : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్‌ ఆలోచించి నిర్ణయం తీసుకుని...అందుకు అనుగుణంగా ప్రచారాలు.. అనంతరం ఒంటరి మహిళల పింఛన్‌కు శ్రీకారం చుట్టారు. కేవలం ఒకటి, రెండు నెలల్లోనే నిర్ణయాలు మారాయో... సాకులు వెతికారో తెలియదుగానీ వయస్సు పేరుతో వీటికి ఎసరు పెట్టారు.ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ప్రభుత్వం పింఛన్లు అందించాలని నిర్ణయిం చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వీటిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మహిళామణుల్లో అలజడి రేపుతోంది. లేనిపోని ఆశలు కల్పించి... వెంటనే రద్దు చేయడంపై మండిపడుతున్నారు.

ఏదీ ఓదార్పు
ఒంటరి మహిళలకు పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం అంతలోనే రద్దు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. పైగా తనకంటూ ఎవరూ లేని...ఆసరా దొరకని మహిళలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఓదార్పు ఇవ్వకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం చివరకు రద్దు నిర్ణయం చూస్తే వారికిచ్చే ప్రత్యేక గుర్తింపు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.

35 ఏళ్లు లేవని సాకు చూపి
జులై నెలలో ఒంటరి మహిళలకు పింఛన్‌ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం..సెప్టెంబరులో 35 ఏళ్లు లేవని సాకు చూపుతూ పింఛన్లను ఏరి వేస్తోంది. ఇప్పటికే ఒకప్రక్క భర్తతోపాటు కుటుంబ సభ్యులకు దూరమై ఒంటరితనంతో నరకయాతన అనుభవిస్తున్న మహిళలకు అంతో ఇంతో పింఛన్‌ రూపంలో అందించే సొమ్మును కూడా వయస్సు సాకుచూపి తొలగిస్తున్నారు. 35 ఏళ్లలోపు మహిళలు అనాథలుగా ఉండకూడదా...ఆసరా లేని వారు ఉండరా...కనీసం కొంతైనా ఆలోచన చేయకుండా ప్రభుత్వం దుశ్చర్యకు నడుం బిగించిందని పలువురు విమర్శిస్తున్నారు.

జిల్లాలో 75 పింఛన్లకు ఎసరు
జిల్లాలో ఒంటరి మహిళలకు సంబంధించి సుమారు 866 పింఛన్లు ఉండగా, అందులో సుమారు 75కు పైగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి పింఛన్‌ అందించి సెప్టెంబరు నెలకు వచ్చేసరికి రద్దు చేశారు. దీంతో మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఎవరు ఇవ్వమన్నారు....ఎందుకు తీసేశారంటూ అధికారులతో వాదనకు దిగుతున్నారు. ఇప్పటికే పింఛన్లను రద్దు చేస్తూ ఎంపీడీఓ కార్యాలయాలకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో సెప్టెంబరులో డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వ తీరుపై బాధిత ఒంటరి మహిళలు మండిపడుతున్నారు.

నిబంధనల మేరకు నడుచుకుంటాం!
జిల్లాలోని తహసీల్దార్ల నుంచి ఒంటరి మహిళల జాబితా వచ్చింది. అప్పట్లో అప్‌లోడ్‌ చేయడంతో అందరికీ మంజూరయ్యాయి. నిబంధనల మేరకు 35 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే పింఛన్‌ పొందడానికి అర్హులు. దీంతో 35 సంవత్సరాలలోపు ఉన్న వారిని తొలగించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టాం.– రామచంద్రారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ

నా పేరు బాల సుబ్బన్న గారి రమాదేవి.మాది కలసపాడు.పదేళ్ల కిందట మైదుకూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. నాకు ఇద్దరు పిల్లలు. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం పుట్టింటిలో ఉంటున్నాను. ప్రభుత్వం ఒంటరి మహిళలకు పింఛన్‌ ఇస్తామంటే దరఖాస్తు చేసుకున్నాను. 2018 జులైలో పింఛన్‌ మంజూరైంది. రెండు నెలలలు ఇచ్చారు.తర్వాత నిలిపివేశారు. అడిగితే 35ఏళ్ల లోపు  ఉన్న వారికి రాదంటున్నారు. ప్రభుత్వం వయస్సువిషయంలో ఆలోచించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement