మహిళలు ఇక అభ‌యంగా ప్రయాణించవచ్చు..

Now womens will travel to the Salvation  - Sakshi

సాక్షి, అమరావతి: మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత రవాణా శాఖ ‘అభయ యాప్‌’ను రూపొందించింది. ఈ మొబైల్‌ యాప్‌తో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. ఇట్టే తెలుసుకోవచ్చు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణాశాఖలకు సమాచారం చేరవేసేందుకు ఈ యాప్‌ ఎంతగానో ఉపకరిస్తుంది. 

వాహనాలకు ఐఓటీ బాక్సులు అమర్చాలి
రాష్ట్రంలో 5.49 లక్షల వివిధ రకాల వాహనాలు ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిలో 4.50 లక్షల వరకు ఆటోలున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో క్యాబ్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకు 79 వేల క్యాబ్‌లు రాష్ట్రంలో నమోదైనట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) బాక్సులు అమర్చాల్సి ఉంటుంది. మహిళలకు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నెంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. రవాణా శాఖ రూపొందించిన ‘అభయ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని రవాణా అధికారులు పేర్కొంటున్నారు. 

రూ. 138 కోట్ల ఖర్చు..
విశాఖపట్నం, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రాష్ట్ర రవాణా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రూ.138 కోట్లు ఖర్చు చేయనుంది. ఐఓటీ బాక్సులు రవాణా శాఖే సమకూర్చనుంది. బాక్సులు అమర్చకపోతే తనిఖీలు చేపట్టి జరిమానా విధించాలని యోచిస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top