నిజమే.. ప్రస్తుతం రైతులకు సలహాలు ఇచ్చేవారు కానరాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
నిజమే.. ప్రస్తుతం రైతులకు సలహాలు ఇచ్చేవారు కానరాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో వ్యవసాయాధికారుల కోసం పడిగాపులు కాస్తున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో వ్యవసాయ పరంగా వస్తున్న మార్పులు, పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలపై అవగాహన కోసం రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తారు.
రాచర్ల మండల పరిధిలోని ఆకవీడు, అనుమలవీడు, రాచర్ల, సోమిదేవిపల్లె, గుడిమెట్ట కొత్తపల్లి, జేపీ చెరువు, చినగానిపల్లె, చోళ్లవీడు, రామాపురం వంటి 14 పంచాయతీల్లో అధిక శాతం సాగు బోర్లపైనే చేస్తుంటారు. ఇక్కడ వ్యవసాయాధికారులతో పాటు, ఉద్యాన, పట్టుపరిశ్రమ, పశు సంవర్థక శాఖలకు చెందిన అధికారులు ఆయా గ్రామాల్లోని రైతులకు పంట ఎంపిక, బలం మందులు, కలుపు తీత, అధిక దిగుబడి, సస్యరక్షణ చర్యలు, పంట తీత వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది.
వరుస ఎన్నికల ప్రభావం
సుప్రీం కోర్టు అక్షింతలతో ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం హడావుడిగా ఎన్నికల నగారా మోగించింది. దీనిలో భాగంగా మొదట పంచాయతీ ఎన్నికల్లో వ్యవ సాయాధికారులు కూడా పాల్గొనాల్సి వచ్చింది. ఆ త ర్వాత ప్రాదేశిక ఎన్నికలు.. బుధవారం సార్వత్రిక ఎన్నికల విధుల్లో కూడా పొల్గొన్నారు. ఇలా వరుసగా అదనపు విధులు నిర్వర్తించాల్సి రావడంతో రైతుల గురించి పట్టించుకొనేవారు కనపడకుండా పోయారు. తత్ఫలితంగా వారికి అమూల్యమైన సలహాలు అందించే అవకాశం లేకుండా పోయింది.
అదర్శరైతులెక్కడున్నారో..
ఆదర్శ రైతుల తీరు మరీ శోచనీయంగా మారింది. వ్యవసాయాధికారులు లేకున్నా.. అన్నదాతలకు అందుబాటులో ఉంటూ సలహాలివ్వాల్సిన ఆదర్శ రైతులు కూడా ముఖం చాటేస్తున్నారు. కనీసం వారి సంఖ్య కూడా ఎవరికీ అంతుబట్టడంలేదు.