
అనకాపల్లి: తనను కుట్రతోనే బదిలీ చేశారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనకాపల్లి జోనల్ కమిషనర్ షేక్ సుభానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ కార్యదర్శిగా పదోన్నతిపై బదిలీ చేస్తూ ఈ నెల 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి విధుల నుంచి రిలీవ్ కావల్సిన నేపథ్యంలో పలువురు అధికారులు, రాజకీయ పార్టీ నేతలు సుభానీని మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల సమక్షంలో కమిషనర్ సుభానీ తన బదిలీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
మున్సిపల్ శాఖ అదనపు సంచాలకులు ఆశాజ్యోతి తనను కుట్రతో బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. ఆశాజ్యోతి గతంలో ఆర్‌డీగా పనిచేసినప్పుడు తనను పలు అంశాల్లో ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు తన బదిలీ విషయంలోనూ కావాలని లక్ష్యం చేసుకున్నారని ఆరోపించారు. తనకు కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే సర్వీసు ఉందని, ఇటువంటి సమయంలో బదిలీ చేయరాదని, ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే సమీప ప్రాంతానికి బదిలీ చేయాలే తప్ప పుట్టపర్తి వంటి దూర ప్రాంతానికి పంపించడం అన్యాయమన్నారు. ఎక్కడికైనా బదిలీపై వెళ్లేందుకు అభ్యంతరం లేదని, కాని వ్యక్తిగత సమస్యలు ఉన్నందున ఇబ్బందులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తానని కూడా వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. తన బదిలీని నిలుపుదల చేసుకునేందుకు ఎటువంటి పైరవీలు చేయనని చెప్పడం గమనార్హం.