హమ్మయ్య!.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు

No New Cases File in Rajamahendravaram East Godavari - Sakshi

నమోదు కాని కొత్త కేసులు

ఊపిరి పీల్చుకున్న వైద్యులు  

35 మందికి శ్వాబ్‌ పరీక్షలు

24 మంది ఆసుపత్రిలో అడ్మిషన్‌

తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం ): రాజమహేంద్రవరంలో మంగళవారం కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం మంగళవారపు పేట, నారాయణపురం, ధవళేశ్వరం, ఆవలోని వాంబే గృహాల నుంచి తీసుకువెళ్లిన కొంత మంది అనుమానితులకు శ్వాబ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం 35 మందికి శ్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో వచ్చిన 35 మందికి శ్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 మందికి నెగెటివ్‌ రావడంతో వారిని హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు. ఇద్దరిని కాకినాడకు తరలించారు.

ఇందులో 50 ఏళ్ల మహిళకు నెగెటివ్‌ వచ్చింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. కిడ్నీ సమస్యతో బాధపడుతుండడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 85 మంది ఇన్‌ పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. పూర్తి గా కరోనా వైరస్‌ వ్యాధిగ్రస్తులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులను ప్రభుత్వ అనుసంధాన ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంగళవారపు పేటకు చెందిన కొందరికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్టు వైద్యులు పేర్కొంటున్నారు. మంగళవారపు పేటకు చెందిన ముస్లిం మహిళ, ఆర్‌ఎంపీతో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచారు. 

రెడ్‌ జోన్లలో పోలీసు పహరా
రెడ్‌ జోన్‌ల పరిధిలో పోలీసులు పహరా కాస్తున్నారు. దారులు పూర్తిగా మూసేసి ఆ రోడ్లలో ఎవరూ తిరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు ఇంటికే పంపేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు ఉంటే వెంటనే అధికారులకు ఫోన్‌ చేసి గాని, ఇంటింటికి వచ్చే ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top