స్తబ్దుగా ట్రేడ్‌ బ్రోకర్‌ కేసు

No Further Action Against Trade Broker Case In Razam - Sakshi

సాక్షి, రాజాం : జిల్లాను కుదిపేసిన ట్రేడ్‌ బ్రోకర్‌ ఆన్‌లైన్‌ మోసం కేసులో పురోగతి లేకుండా పోయింది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితులు జన స్రవంతిలో దర్జాగా తిరుగుతున్నారు. వీరిని పట్టుకోకుండా 18 నెలలుగా కేసు దర్యాప్తు పేరిట సీఐడీ పోలీసులు స్తబ్దుగా ఉండిపోయారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హడావుడి చేసిన పోలీసులను పక్కనబెట్టి, మరింత పారదర్శకంగా కేసు విచారణ చేపట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించినా బాధితులకు న్యాయం చేకూరడం లేదు. 

సూత్రధారి దొరికితేనే..
సంతకవిటి మండలం మందరాడ గ్రామ వేదికగా బయటపడిన ట్రేడ్‌ బ్రోకర్‌ కేసు దర్యాప్తులో భాగంగా అప్పట్లో సివిల్‌ పోలీస్‌లు హడావుడి చేశారు. నెల రోజుల వ్యవధిలో కేసులో పలు కీలక అంశాలు సేకరించి పలువురిని అరెస్టు చేశారు. అనంతరం సీఐడీకి ఈ కేసు బదిలీ చేశారు. అప్పట్నుంచి కేసు దర్యాప్తు పేరిట నాన్చుతున్నారు. అప్పట్లో అధికార పార్టీ అండదండలతో గట్టెక్కిన ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు హాయిగా ప్రజల్లో ఉండటం గమనార్హం. 

రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలు..
ట్రేడ్‌ బ్రోకర్‌ వద్ద పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళనకు గురై ఇద్దరు ఆకస్మికంగా మృతిచెందారు. వీరిలో సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన దాసరి కన్నంనాయుడు కుటుంబ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఈయన కష్టసుఖాలను ఓర్చి గ్రామ పెద్దగా ఎదిగారు. ఎంతోమందికి న్యాయం చేయడంతోపాటు మోసగాళ్లకు బుద్ధి చెప్పారు. అటువంటి తనే చివరికి ట్రేడ్‌ బ్రోకర్‌ చేతిలో మోసపోయానని తెలుసుకుని గుండెపోటుకు గురయ్యారు. ఈయన పెట్టిన పెట్టుబడులకు ఎంతో కొంత వస్తుందని కుటుంబానికి ఏమాత్రం భరోసా రాలేదు.

ఇదే మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడమ్మ  కూడా పెట్టుబడులు పెట్టింది. మనుమరాళ్లు వివాహం నిమిత్తం పెట్టిన నగదు మరి రాదని తెలుసుకుని మంచం పట్టి ఆస్పత్రి పాలైంది. చివరకు మృతి చెందింది. ఇదేవిధంగా మరి కొంతమంది మంచం పట్టారు. ఇంకా ఎంతోమంది తమ డబ్బులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. 18 నెలలుగా గుండె దిటవు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.  

న్యాయం చేయాలని వేడుకోలు...
అప్పటివరకూ అధిక వడ్డీలను కొంతమంది బ్రోకర్లుకు ఇచ్చి, బాగా పెట్టుబడులు వచ్చిన తర్వాత ట్రేడ్‌ బ్రోకర్‌ తన కార్యాలయాన్ని 2017 నవంబర్‌ 17న ఎత్తివేశాడు. అంతవరకూ ఆయనతో కలసిమెలసి, చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పెద్దమనుషులు తమకేమీ తెలియదని చేతులెత్తేశారు. తొలుత ఈ వ్యాపారం రూ. 2 నుంచి 3 కోట్ల వరకూ మాత్రమే ఉంటుందని అందరూ భావించారు. బ్రోకర్‌ టంకాల శ్రీరామ్‌ కార్యాలయానికి తాళాలు వేయడంతో ఈ షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు.

సంతకవిటి పోలీస్‌ స్టేషన్‌లో బ్రోకర్‌ హామీలు రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ. 36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. మొత్తం రూ. 180 కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. వీరంతా పోలీస్‌ స్టేషన్ల చుట్టూ, టీడీపీ నేతల చుట్టూ తిరిగారు. ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. 

సీఐడీ డీఎస్పీ ఏమన్నారంటే..
ఈ విషయంపై సీఐడీ విశాఖ డీఎస్పీ ఎస్‌ భూషణనాయుడు వద్ద ప్రస్తావించగా ట్రేడ్‌ బ్రోకర్‌ కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు రికవరీ, ప్రధాన పాత్రధారులు వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top