కోడి కూయని పల్లె!ఏ గ్రామమైనా కోడికూతతో మేల్కొంటుంది. అయితే అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం అడిగుప్ప గ్రామంలో మాత్రం ఆ కూత వినిపించదు. చూద్దామంటే కోడీ.. కోడిగుడ్డూ కనిపించదు. రాయదుర్గానికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 95 ఇళ్లు ఉన్నాయి. 470 మంది నివసిస్తున్నారు. ఎవరూ కూడా మద్యం, కోడి మాంసం ముట్టరు. ఇది పూర్వం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయమని గ్రామస్తులు చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ‘వందేళ్ల క్రితం ఈ ప్రాంతం సామంత రాజుల పాలనలో ఉండేది. చిత్రదుర్గం రాజులు తరచూ ఈ గ్రామంపై దాడి చేసి అందినకాడికి దోచుకుపోయేవారు.

 

  తమను దాడుల నుంచి రక్షించాలంటూ ప్రజలందరూ సమీపంలోని కొండపై ఉన్న రాజుల దేవర గుడి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తికి దేవుడు పూని.. మీ గ్రామ కాపలాదారులకు కోడి మాంసం, మద్యం ఎరగా చూపి దాడులు చేస్తున్నారని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ గ్రామంలో ఎవరూ కోడి మాంసం, మద్యం ముట్టరాదని నియమం. కోళ్లు అసలే పెంచరు. ఇప్పటికీ గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డుకు బదులు పండ్లు ఇస్తున్నారు. ఎవరైనా మద్యం తాగివస్తే గ్రామ బహిష్కరణ చేస్తున్నాం’ అని వివరించారు. ఈ దేవుడిపై గ్రామస్తులకు చాలా నమ్మకం. ప్రతి ఇంట్లో ఒకరికైనా ఈ దేవుడి పేరు పెట్టుకుంటారు. ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఈ గ్రామంలో 102 మంది.. రాజమ్మ, రాజయ్య, రాజులయ్యలు ఉన్నారు.                               


- న్యూస్‌లైన్, గుమ్మఘట్ట (అనంతపురం)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top