నిఘా నేత్రం మరిచారు! | No CC cameras aranged over Vijayawada celebrations | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రం మరిచారు!

Jan 25 2015 4:10 AM | Updated on Aug 14 2018 3:37 PM

నూతన రాజధాని ప్రాంతంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో సరైన నిఘా లేకపోవటం కలవరపాటుకు గురి చేస్తోంది.

సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని ప్రాంతంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో సరైన నిఘా లేకపోవటం కలవరపాటుకు గురి చేస్తోంది. రాజకీయ రాజధానిగా ఖ్యాతి గడించిన విజయవాడలో ఈ వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినా సీసీ కెమెరాల ఏర్పాటుపై శ్రద్ధ చూపలేదు. సమయం చాలనందున ఏర్పాటు చేయలేకపోయామని, కట్టుదిట్టమైన నిఘా ఉం టుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఆదివారం రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 7.15 గంటలకు ప్రారంభమ య్యే ఈ వేడుకలు దాదాపు రెండు గంటలకుపైగా కొనసాగనున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు, వెయ్యి మందికిపైగా అతి ముఖ్యమైన అతిథులు, 600 మంది ముఖ్య అతిథులు హాజరుకానున్నారు. మరో 1500 మంది అతిథులు స్టేడియం లోపల ఆశీనులవుతారు.
 
  సుమారు 15వేల మందికిపైగా విద్యార్థులు, ప్రజలను స్టేడియం గ్యాలరీలోకి అనమతించనున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమంలో స్టేడియం ఆవరణలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. శనివారం నుంచి స్టేడియం ఆవరణలో అక్కడక్కడ వీటిని ఏర్పాటు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లతోపాటు బెంజి సర్కిల్, రమేష్ హాస్పిటల్, రామవరప్పాడు తదితర జంక్షన్‌లలో సీసీ కెమెరాలున్నా.. అవి ఎంత వరకు పనిచేస్తున్నాయన్నది అనుమానమే.
 
 భారీగా పోలీసుల మోహరింపు..
 గణతంత్ర వేడుల సందర్భంగా మున్సిపల్ స్టేడియం వెలుపల ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు మోహరించారు. స్టేడియంలో శని వారం ఫుల్ డ్రెస్డ్ రిహార్సల్స్‌ను పరిశీలించిన డీజీపీ జేవీ రాముడు సంతృప్తి వ్యక్తంచేశారు. డీజీపీ నేతృత్వంలో నలుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. 14 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, వంద మంది ఎస్సైలు, 150 మంది ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్స్, వెయ్యి మందికిపైగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధుల్లో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement