ఏపీ రాజధాని నిర్మాణంపై ఎన్జీటీ తుదితీర్పు

NGT final verdict on capital construction in Andhra Pradesh  - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

కొండవీటి వాగు దిశ మార్చొద్దు

కరకట్టలు ముందుకు జరపొద్దు

సాక్షి, న్యూఢిల్లీ :  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ప్రిన్సిపల్‌ బెంచ్‌ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. రాజధాని నిర్మాణానికి ఎన్‌జీటీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే పర్యావరణం దెబ్బతినకుండా, నిబంధనలకు లోబడే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్‌జీటీ ఆదేశించింది.

అంతేకాకుండా నిర్మాణ పనులపై నెలనెలా సమీక్షించాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణకు  సూపర్‌వైజర్, ఇంప్లిమేషన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌, సభ్యులు జస్టిస్‌ రఘువేంద్ర రాథోర్‌, జస్టిస్‌ బిక్రమ్‌సింగ్‌ సజ్వాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. అలాగే కొండవీటి వాగు దిశను మార్చరాదని, కరకట్టలను ముందుకు జరపవద్దని స్పష్టం చేసింది. అలాగే పర్యావరణ శాఖ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఎన్‌జీటీ పేర్కొంది.

రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుండటంపై పి.శ్రీమన్నారాయణ, మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఎఎస్‌ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు 2015 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవలే వాదనలు ముగించిన ఎన్‌జీటీ తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాటిపై ఇవాళ ఉదయం తుది తీర్పును వెలువరించింది.

ఎన్‌జీటీ తీర్పును స్వాగతించిన శ్రీమన్నారాయణ
ఏపీ రాజధాని నిర్మాణంపై ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పును పిటిషనర్‌ శ్రీమన్నారాయణ స్వాగతించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను ఆపడంలో తొలిమెట్టు ఎన్‌జీటీ తీర్పు అన్నారు. కొండవీటి వాగు దిశను మార్చొద్దనడం వల్ల 15వేల ఎకరాలకు ముప్పు తప్పిందన్నారు. రెండు కమిటీల నియామకంతో ప్రభుత్వ ఇష్టారాజ్యం కుదరదని, పంటలు పండే భూములను కాపాడేవరకూ తన పోరాటం ఆగేది లేదని శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.

చంద్రబాబుకు చెంపపెట్టు: ఎమ్మెల్యే ఆర్కే
ఎన్‌జీటీ తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టు లాంటిదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్‌జీటీ తీర్పుతో అయినా సీఎం తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కృష్ణానది పరిరక్షణను సీఎం ఇంటి నుంచే ప్రారంభించాలని అన్నారు. కొండవీటి వాగును తమకు అనుకూలంగా మార్చుకోవాలనే టీడీపీ కుట్రలకు ఎన్‌జీటీ బ్రేక్‌ వేసిందని ఆర్కే పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top