సింహపురికి ఇంటర్‌సిటీ

New Train Opened Between gudur Junction To Vijayawada  - Sakshi

సాక్షి, నెల్లూరు : దక్షిణ మధ్య, దక్షిణ రైల్వే జోన్ల ఎండ్‌ పాయింట్‌గా ఉన్న గూడూరు జంక్షన్‌ నుంచి రాజధాని అమరావతి విజయవాడకు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు నేటి నుంచి పట్టాలెక్కనుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చినా.. కొత్త రాజధాని అమరావతి కేంద్రమైన విజయవాడకు నెల్లూరు జిల్లా నుంచి పగటి పూట ప్రత్యేక రైలు లేకుండా పోయింది. ఇప్పటి వరకు విజయవాడకు వెళ్లాంటే చెన్నై, తిరుపతి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లే దిక్కుగా ఉన్నాయి. ఇవీన్ని కూడా ఎక్కువగా రాత్రి వేళలో నడుస్తున్నాయి. గూడూరు నుంచి సికింద్రాబాద్‌కు సింహపురి సూపర్‌ఫాస్ట్‌ రైలు ఉన్నప్పటికీ ఇది కూడా రాత్రి వేళ ఉంది.

గూడూరు– విజయవాడ మధ్య ఉదయం, మధ్యాహ్నం ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. అయితే  ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన  ఓటాన్‌ బడ్జెట్‌లో కానీ, ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌లో కానీ జిల్లా నుంచి విజయవాడకు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి రైల్వే ప్రాధాన్యతలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు, ఎంపీల డిమాండ్‌తో గూడూరు నుంచి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును అనూహ్యంగా ప్రకటించారు. ఎప్పటి నుంచో జిల్లా వాసులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి
గూడూరు– విజయవాడ మధ్య ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం గూడూరులో  ప్రారంభించనున్నారు. గత వారమే ఈ ట్రైన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. గూడూరు–విజయవాడ (రైలు నంబరు 12743) ఉదయం 6.10 గంటలకు గూడూరులో బయలుదేరుతుంది. విజయవాడకు ఉదయం 10.40 గంటలకు చేరుతుంది.  విజయవాడ–గూడూరు (రైలు నంబరు12744) విజయవాడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి గూడూరుకు రాత్రి 10.30 గంటలకు చేరుతుంది. ఈ రైలు రెండు ఏసీ చైర్‌కార్‌లు, పది సెకండ్‌ చైర్‌కార్‌లు కోచ్‌లు ఉన్నాయి. 

8 చోట్ల స్టాపింగ్‌ 
జిల్లా నుంచి వివిధ వ్యాపారాల నిమిత్తం వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు గూడూరు, నెల్లూరు, కావలి నుంచి విజయవాడ వరకు నిత్యం 7 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి కొన్ని ట్రైన్స్‌ అనువుగా ఉన్నా, కొన్ని చోట్ల నిలుపుదల లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆ రైళ్లు సుదూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో జిల్లా వాసులు వాటిలో ప్రయాణాలు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.  దీంతో జిల్లా నుంచే ట్రైన్‌ విజయవాడకు మొదలు కానుండడంతో చాలా వరకు సౌకర్యం కలగనుంది. ప్రధానంగా గూడూరు నుంచి బయలుదేరే ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి రైల్వేస్టేషన్లల్లో నిలుపుదల, చివరగా విజయవాడలో ట్రైన్‌ ఆగుతుంది. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా అవే స్టేషన్లలో ట్రైన్‌  నిలుపుదల చేయనున్నారు. 

రైలుకు పేరుపై కసరత్తు
గూడూరు–విజయవాడ మధ్య నూతనంగా ప్రారంభింనున్న ట్రైన్‌కు ఏ పేరు పెడతారన్న దానిపై కసరత్తు జరుగుతోంది. చాలా చోట్ల రైళ్లకు ఆయా ప్రాంతాల పేర్లు, లేక ఆధ్యాత్మిక కేంద్రాలతో వచ్చే పేర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు వేదగిరి ఎక్స్‌ప్రెస్, లేదా తల్పగిరి ఎక్స్‌ప్రెస్, లేదా షార్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్లు ప్రతిపాదనలపై ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరేదైనా పేరు పెడతారా వేచి చూడాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top