నీరజ్‌ మృతితో జ్ఞానాపురంలో విషాదఛాయలు

Neeraj Kumar Died With Blood Cancer - Sakshi

వైద్యుల నిర్లక్ష్యంతో తిరిగిరాని లోకాలకు..

కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరు

సాక్షి, జ్ఞానాపురం(విశాఖ దక్షిణం): బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న నీరజ్‌కుమార్‌ మృతితో జ్ఞానాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో అందిన చికిత్సతో ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న నీరజ్‌ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆదివారం కాన్వెంట్‌ కూడలి శ్మశానవాటికలో నీరజ్‌ అంత్యక్రియలు పూర్తి చేశారు. జ్ఞానాపురం బాబు కాలనీకి చెందిన నీరజ్‌కుమార్‌ టెన్త్‌ వరకు రవీంద్రభారతి పాఠశాలలో చదువుకున్నాడు. 2017–18 టెన్త్‌లో 9.5 జీపీఏతో ఉత్తమ విద్యార్థిగా మంచిపేరు సంపాదించుకున్నాడు. నీరజ్‌ తండ్రి అప్పలనాయుడు పూర్ణామార్కెట్‌లో కలాసీ తల్లి దేవి గృహిణి సోదరుడు పాలిటెక్నిక్‌ పూర్తి చేశాడు.

కుమారులను ఉన్నత చదువులు చదివించాలని తపన పడ్డారు. అయితే నీరజ్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌ రావడంతో వారి ఆశల అడియాసలయ్యాయి.  మెరుగైన వైద్యం అందించే ఆర్థిక స్తోమత వారికి లేదు. దీంతో గత నెల 4న విశాఖ వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయం వద్ద నీరజ్‌ స్నేహితులు పరిస్థితి వివరించారు. చికిత్సకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇవ్వడంతో వారి ఆశలు చిగురించాయి. ఈ మేరకు వైద్యం కూడా అందించారు.

వైద్యులు పొట్టన పెట్టుకున్నారు!
మరో మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తాడనుకున్న తమ కుమారుడు నీరజ్‌ను వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విగతజీవిని చేసి పంపారని ఆయన తల్లిదండ్రులు ఆరోపించారు. డిశ్చార్జి అయి తమతో ఎప్పటిలాగే తిరుగుతాడని అనుకున్న స్నేహితులు, కాలనీవాసులు, కుటుంబ సభ్యులు.. నీరజ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. డాక్టర్‌ హరికృష్ణ, భాస్కర్‌లు చికిత్స చేసేవారని, శనివారం డాక్టర్‌ డొక్క ప్రదీప్‌ హంగమా చేసి ఆక్సిజన్‌ అందలేదంటూ తమ కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని, ఆయనపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top