ఎన్నికల వాయిదా వద్దు | Neelam Sahani Comments On Local Body Elections Postpone | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల వాయిదా వద్దు

Mar 17 2020 3:56 AM | Updated on Mar 17 2020 8:03 AM

Neelam Sahani Comments On Local Body Elections Postpone - Sakshi

నీలం సాహ్ని

స్థానిక ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోరారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథాతథంగా ఎన్నికలను నిర్వహించాల్సిందిగా ఆమె కోరారు. కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టంచేశారు. (ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం ఏకపక్షం)

ఈ మేరకు నీలం సాహ్ని సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కోవిడ్‌–19పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉంటే వాస్తవ పరిస్థితిని తెలియజేసేవారమని.. కానీ, ఎలాంటి సంప్రదింపులు లేకుండానే స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సమంజసం కాదని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాక.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉందని కూడా ఆమె వివరించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్‌ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయన్నారు. మరోవైపు.. కరోనాపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మీద వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రతిని కూడా తన లేఖకు సీఎస్‌ జతపర్చారు. నీలం సాహ్ని తన లేఖలో ఇంకా ఏం చెప్పారంటే.. 

– ఏపీలో గ్రామ పంచాయతీల పదవీ కాలం 1.8.18న, ఎంపీటీసీ, జెడ్పీటీసీలది 3–4–19న, పట్టణ స్థానిక సంస్థలది 2–7–19న ముగిసిందని మీకు బాగా తెలుసు.
– ఈ విషయంలో, ఎన్నికల జాబితాల తయారీ, ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ప్రచురణ ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
– ఇంకా అనేక చట్టపరమైన అవరోధాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) రాష్ట్ర క్రియాశీల సహకారంతో 2020 మార్చిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించి ఇదే నెల చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా 7.3.20న ఎన్నికల షెడ్యూల్‌ జారీచేసింది. 
– దీంతో జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఎన్నికలకు సర్వసన్నద్ధమయ్యారు.
– నామినేషన్ల రశీదులు తయారీ, పోల్‌ సిబ్బందిని గుర్తించడం, శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాలెట్‌ బాక్సుల సేకరణను కూడా పూర్తిచేశారు. అలాగే, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్న సమయంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంతో ముందుజాగ్రత్తగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. 
– ఈ విషయంలో.. ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలియజేయాలనుకుంటున్నాను. ఎన్నికల వాయిదాకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తే వాస్తవ పరిస్థితి తెలిసేది. కరోనా నివారణకు జాతీయ విపత్తు నిధి నుంచి రాష్ట్రాలకు నిధులిచ్చేందుకే కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటన చేసింది. 
– ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసు ఒకటే నమోదైంది. అది కూడా ఇటలీ నుండి తిరిగి వచ్చిన వ్యక్తే కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ స్థానికులకు ఎవ్వరికీ వైరస్‌ సోకలేదు.
– రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్‌ చేసి, ఇంటింటికీ వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అంతేకాక.. రాష్ట్రంలో వైరస్‌ అదుపులో ఉంది. రాబోయే 3–4 వారాల్లో భయంకరంగా వ్యాప్తి చెందే ప్రమాదమూ లేదు.
– ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలక వర్గాలు ఏర్పాటైతే కరోనా నియంత్రణలో అవి కీలకపాత్ర పోషిస్తాయి.
– కోవిడ్‌–19 నివారణలో భాగంగా పోలింగ్‌ స్టేషన్లలో అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి తగిన సలహా ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. 
– ప్రచారం కోసం ఎలక్ట్రానిక్‌ మీడియాను ఉపయోగించమని అభ్యర్థులను ప్రోత్సహించవచ్చు.. పోల్‌ రోజున క్యూ లైన్లను పరిమితం చేయవచ్చు.. ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు.. ఏదేమైనా, తగ్గిన ప్రచార కాలం కూడా కరోనా నుండి కాపాడేందుకు సహాయపడుతుంది.
– ఈ నేపథ్యంలో.. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి. 

- ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపివుంటే కోవిడ్‌పై వాస్తవ నివేదికను అందించేవాళ్లం.
విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్‌ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది.
ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా ఉపయోగపడతాయి. 
రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం. 
ఎన్నికల సంఘం తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement