నడి వేసవిలో ‘నారాయణ’ 

Narayana College Forced classes in the Summer - Sakshi

నిబంధనలకు విరుద్ధంగా తరగతుల నిర్వహణ

వేసవి సెలవుల్లోనూ బలవంతంగా క్లాసులు

ఎండలు మండిపోతున్నా పట్టించుకోని యాజమాన్యం

తల్లిదండ్రులు చెబుతున్నా సెలవులు ఇవ్వని వైనం

నరకానికి నకళ్లుగా కానూరు, గొల్లపూడి క్యాంపస్‌లు

నిబంధనలు తుంగలో తొక్కుతున్నా పట్టించుకోని అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో : నారాయణ కాలేజీల యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వేసవిలో సెలవులు ఇవ్వకుండా ఉక్కపోతలో విద్యార్థులను మగ్గబెడుతున్నాయి. తమ పిల్లలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నా యాజమాన్యాలు ఇసుమంతైనా లెక్కచేయడం లేదు. ఇష్టం ఉంటే ఇక్కడ చేర్పించండి లేదంటే.. వెళ్లిపోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి.  

ఏసీ క్యాంపస్‌ల పేరుతో నిలువు దోపిడీ..! 
విజయవాడలోని కార్పొరేట్‌ కళాశాలలన్నీ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. 10వ తరగతి ఫలితాలు వెలువడక ముందు నుంచే ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు  ప్రారంభించాయి. ఏసీ క్యాంపస్‌ల పేరుతో తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏసీలు పనిచేయకపోవడంతో వేసవిలో ఉక్కపోతకు విద్యార్థులు అల్లాడుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు. టిఫిన్, లంచ్, డిన్నర్‌ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చి మిగిలిన సమయమంతా తరగతుల్లో పాఠాలు బోధిస్తూ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు హాస్టల్‌ పేరుతో మరో దోపిడీకి యాజమాన్యాలు తెరతీశాయి. నగరంలోని కార్పొరేట్‌ కళాశాలల్లో అధిక శాతం క్యాంపస్‌లు అనుమతిలేని భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నివాసానికి అనుగుణంగా నిర్మించిన ఫ్లాట్లలో తరగతులు నిర్వహిస్తున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు.  

నిబంధనలు పట్టవా..! 
నిబంధనల మేరకు ఇంటర్‌ తరగతులు జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నగరంలోని కార్పొరేట్‌ కాలేజీలు ఇప్పటికే తరగతులు ప్రారంభించాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. పరీక్షలు ముగియగానే కేవలం వారం రోజులు సెలవులు ఇచ్చి వెంటనే తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. అలాగే పదో తరగతి ఫలితాలు ఈ నెల 14న విడుదలకాగా 10వ తరగతి పూర్తయిన పది రోజులకే కార్పొరేట్‌ కళాశాలలు ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభించాయి. వేసవిలో తరగతులు నిర్వహిస్తే  చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలను కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. 

ఆ రెండు క్యాంపస్‌లంటే దడ..! 
పెనమలూరు నియోజకవర్గం కానూరులోని నారాయణ ఎన్‌40 లేడీస్‌ క్యాంపస్, గొల్లపూడి నల్లకుంటలోని అయ్యప్ప క్యాంపస్‌లు నరకానికి నకళ్లుగా మారాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రత్యేక తరగతుల పేరుతో వేసవి సెలవులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అనుమతుల్లేని భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెరచాటుగా లంచాలు ముట్టజెప్పడంతోనే మిన్నకుండిపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top