రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోసం చేస్తున్నారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోసం చేస్తున్నారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.సుధాకర్ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యయన కమిటీల పేరుతో హామీలను గాలికి వదిలేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. ఏదో ఒక సాకుతో రుణమాఫీని కుదించడానికే అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టు సుధాకర్ మండిపడ్డారు. రుణమాఫీకి చంద్రబాబు సుముఖంగా ఉన్నా బ్యాంకర్లు, అధికారులు, అధ్యయన కమిటీలు అడ్డుపడుతున్నట్టు తన మీడియా సంస్థలచే ప్రచారం చేసుకోనున్నారని చెప్పారు. కుంటిసాకులు మాని వెంటనే ఎన్నికల హామీని అమలు చేసి రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.