ఖాకీ ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

ఖాకీ ఉక్కుపాదం

Published Thu, Jul 27 2017 1:57 AM

ఖాకీ ఉక్కుపాదం

గడప దాటకుండానే ముద్రగడ గృహ నిర్బంధం
- కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత 
-మీడియాతో మాట్లాడేందుకూ అనుమతి నిరాకరణ
వాట్సాప్‌ వీడియో పంపించిన ముద్రగడ
 
(కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఊహించినట్టే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాలు కదపకుండా ఖాకీలు ఉక్కుపాదం మోపారు. ఇంటి గుమ్మం దాటకుండానే భారతీయ శిక్షాస్మృతిలోని 151వ సెక్షన్‌ కింద 24 గంటల పాటు గృహ నిర్బంధం చేశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు, చేసితీరతానంటూ ముద్రగడ పట్టుపట్టడంతో బుధవారం కిర్లంపూడిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బలహీన వర్గాల (బీసీ) జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి 25 రోజుల పాటు ‘చలో అమరావతి’ పేరిట నిరవధిక పాదయాత్రకు పూనుకున్నారు. పోలీసులు అటకాయించారు. దీంతో పోలీసు అధికారులు, ముద్రగడ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ఎంతకూ పోలీసులు వినకపోవడంతో ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు తాను పాదయాత్ర మొదలు పెడతానని, ఎంతకాలం అడ్డుకుంటారో అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. యాత్రను పోలీసులు అడ్డుకున్నారన్న వార్త  దావానలంలా వ్యాపించడంతో కాపు యువత విడతల వారీగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. ముద్రగడ మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపినా పోలీసులు అనుమతిం చక పోవడం తో ఆయనే ఓ వీడియోను విలేఖరులకు వ్యాట్సాప్‌ ద్వారా పంపించారు. అందులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. కాపు ఓట్లతో గెలిచి కాపులకే అన్యాయం చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు మొదలయిన ఈ వ్యవహారం రాత్రి పొద్దుపోయేంత వరకు సాగింది. పోలీసుల ఆంక్షలతో కిర్లంపూడి కటకటలాడింది. 
 
ఇలా మొదలైంది....
ఉదయం 8.45 గంటల తర్వాత ఎప్పుడైనా ముద్రగడ తన అనుచరులతో బయటకు రావొచ్చని తెలియడంతో పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు, రిజర్వ్‌డ్‌ పోలీసు దళాలు పొజిషన్‌ తీసుకున్నాయి. నీటి ఫిరంగులు, అగ్నిమాపక యంత్రాలు, భాష్పవాయు గోళాలు, మైకులు, తుపాకులతో పోలీసులు సిద్ధమయ్యారు. ఇంటి మెయిన్‌గేటు ఎదుట మూడంచెల భద్రత ఏర్పాటయింది. ముద్రగడ అప్పటికే తన అనుచరులతో భేటీ, పూజాపునస్కారాలు ముగించుకుని 9.06 గంటలకు ఇంటి ముంగిట నిలుచున్నారు. 9.11 గంటలకు అనుచరులతో కలిసి నడుచుకుంటూ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఓఎస్డీ శంకర్‌రెడ్డి, డీఎస్పీ రామారావు తదితరులు ముద్రగడకు ఎదురువెళ్లి అటకాయించారు. ‘మీ పాదయాత్రకు అనుమతి లేదు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నాం. మీరు కదలడానికి అవకాశం ఇవ్వం’ అని చెప్పారు. దీంతో ముద్రగడ చాలా ఓపిగ్గా ఈ యాత్ర కోసం తానేమేమి చేసిందీ వివరించారు. సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, రూట్‌ మ్యాప్‌ పంపించానంటూ వాటి నకళ్లను చూపించారు. ఈదశలో పోలీసులు మళ్లీ హౌస్‌ అరెస్ట్‌ ప్రస్తావన తేవడంతో ముద్రగడ ఆగ్రహోదగ్రుడయ్యారు. ‘ఇంట్లో ఎందుకు? అరెస్ట్‌ చేసి జైల్లో పడేయండి.

హైకోర్టు కూడా పాదయాత్ర ప్రాథమిక హక్కని చెప్పింది. సుప్రీంకోర్టూ అదే చెప్పింది. పాదయాత్రకు పూర్తి బాధ్యత నాదే. నా మాట మీద నమ్మకం లేకపోతే మీ ప్రొటెక్షన్‌లో నన్ను నడిపించండి. అంతేగాని ఈ అత్యాధునిక ఆయుధాలేమిటీ, 94 కేసులంటూ నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. వీటికి బెదరను. సీఎం స్థాయి వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడలేదేమిటా? అని బాధపడుతున్నా. ముందు మంజునాథ కమిషన్‌ అన్నారు. సర్వే రిపోర్టన్నారు. ఆగస్టులోగా పరిష్కారమన్నారు. ఇంకెంత కాలం ఆగాలి? ఎప్పుడిస్తారో చెప్పమని అడగడానికి వెళతానంటుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు’’ అని ప్రశ్నించారు. 
 
మేమేమన్నా పాకిస్తాన్‌లో ఉన్నామా?
ముద్రగడతో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినప్పటికీ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అంగీకరించలేదు. దీంతో ఆయనే ఓ వీడియోను మీడియాకు పంపారు. అదే సమయంలో సాక్షి ప్రత్యేక ప్రతినిధి కూడా టెలిఫోన్‌లో ఆయన అనుచరుని సహకారంతో ముద్రగడతో మాట్లాడారు. వాటి సారాంశం ఇదీ...  ‘‘మేమేమీ చంద్రబాబు ఆస్తులు అడగడం లేదు. మా ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు దాటుతోంది. ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాలి. బాబు చెప్పిన మాటనే అమలు చేయమంటున్నాం.

కిర్లంపూడి  ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? పాస్‌పోర్టు, వీసాలతో ఈ గ్రామానికి రావాలా? బ్రిటిష్‌ పాలకుల్ని అడిగి మహాత్ముడు దీక్ష చేశారా? ఈ అణచివేత ఏమిటి? దేనికి బెదిరిస్తున్నారు?... అంతర్జాతీయ నేరగాడిగా చిత్రీకరించదలిచారా? అదే అయితే జైల్లో పడేయండి. అంతేగాని బెదిరింపులతో మీకు (సీఎం) మొక్కాలని కోరుకోవద్దు.  నష్టపోతావ్‌ చంద్రబాబు... మీకున్నది బలుపే గాని బలం కాదని గుర్తుపెట్టుకో.  ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు గేటు దగ్గరకు వస్తా. పాదయాత్రకు పూనుకుంటా. నాది నిరవధిక యాత్ర. అడ్డు తొలగిస్తావో, అడ్డుకుంటావో మీ ఇష్టం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని ముద్రగడ అన్నారు.  
 
వైఎస్‌ నక్సలైట్లతోనే చర్చలు జరిపారు...
‘వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లను సైతం పిలిపించి చర్చలు జరిపారు. అనంతరం వాళ్లను సగౌరవంగా వాళ్ల స్థావరాలకు పంపించారు. నేను అంతటి నక్సలైట్‌ను కూడా కాదే... కానీ మీరు నన్నో అంతర్జాతీయ ఉగ్రవాదిని చూసినట్టు చూస్తున్నారు. అందువల్ల సమస్య మీ ముఖ్యమంత్రిదే గాని నాది కాదు. ఆగస్టులోగా పరిష్కరిస్తామన్నారు గనుక మళ్లీ గుర్తు చేస్తున్నాం. అదే తప్పయితే నాకు బేడీలు వేసి రోడ్ల మీద నడిí పించండి’ అని ముద్రగడ అన్నారు. ఈ దశలో ఓఎస్‌డీ శంకర్‌రెడ్డి ఏదో చెప్పబోగా తనకు ఏమీ చెప్పవద్దంటూ ఆయన ఇంట్లోకి వెళ్లిపోయారు. అప్పటికి సమయం 9.37 గంటలయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement