దేశాయ్‌ చెరువులో మట్టి దొంగలు 

Mud Thieves in Desai Pond - Sakshi

దర్జాగా అక్రమ తవ్వకాలు 

ఇటుక బట్టీలకు తరలింపు 

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ఎమ్మిగనూరు:  మట్టి రుచి ఎరిగిన అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అధికారుల అండదండలతో మట్టి దొంగలు రూ. కోట్లకు పడిగలెత్తుతున్నారు. నందవరం మండలం హాలహర్వి రెవెన్యూ పరిధిలోని దేశాయ్‌ చెరువు ఉంది. దశాబ్దాల కాలంగా ఈ చెరువుకింద వందలమంది రైతులు తమ పంటలను పండించుకొంటున్నారు. ఇరిగేషన్‌ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఈ చెరువు  అధికారులకు, రాజకీయ దళారులకు ఆదాయవనరుగా మారింది. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా కొనసాగిన మట్టిదోపిడీ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. చెరువులో మట్టిని తవ్వేందుకు ఎమ్మిగనూరు పరిసరప్రాంతంలోని ఇటుకల బట్టీల యజమానులు ఏకంగా ప్రొక్లెయినర్‌లను, జేసీబీలను వాడుతున్నారు. ప్రతి రోజు 60 నుంచి 90 ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించేందుకు వినియోగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ కనీసం ఆరు ట్రిప్పుల మట్టిని రోజూ తరలిస్తోంది. ఒక్క ట్రాక్టర్‌ మట్టిని తరలించేందుకు ఇటుకల బట్టీల యజమానులు రూ.650 చెల్లిస్తారు.

 ఐదేళ్లూ దోపిడీ.. 
తెలుగుదేశంపార్టీ్ట అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు మట్టిని యథేచ్చగా దోచేశారు. చెరువులో సారవంతమైన జిగుట మట్టి కావటంతో ఇటుకల తయారికీ అనుకూలంగా ఉంది. దాదాపు 8 ఇటుకల బట్టీలకు ఈ ఒక్క చెరువుమట్టినే తరలిస్తున్నారంటే ఈ మట్టి ప్రాధాన్యతేమిటో తెలుస్తోంది. చెరువు మట్టితో ఇటుకల బట్టీ యజమానులు కోట్లకు పడగలెత్తారు. చెరువులో మట్టిని తరలించిన తరువాత నీరు–చెట్టు కింద అధికారులు బిల్లులు చేయటం, వాటిని దిగమింగటంలో అప్పటి టీడీపీ నేతలూ సిద్ధహస్తులే. అధికారం మారినా దేశాయి చెరువులో మట్టిదోపిడీ మాత్రం ఆగటం లేదు. ఇక్కడ దోపిడీ ‘అధికారిక’ పేటెంట్‌గా మారింది. సమన్వయంతో ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం కళ్లకు గంతలు కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పొలాలకు ఉపయోగపడాల్సిన సారవంతమైన ఒండ్రుమట్టి నేడు వ్యాపారవస్తువుగా మారింది. ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి ఇటుక బట్టీల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. 

ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు
హాలహర్వి దేశాయ్‌ చెరువులో మట్టి తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని, ప్రస్తుతం తాము ఎవరికి అనుమతులివ్వలేదని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మట్టి అక్రమ తరలింపును అడ్డుకొనేందుకు రెవెన్యూ,పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టాలన్నారు.  –వెంకటేశ్వర్లు, ఎల్లెల్సీ డీఈ       

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top