డెలీ'వర్రీ'

Mother And Child Deaths In East Godavari - Sakshi

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగని మరణ మృదంగం

మృత్యువాత పడుతున్న గర్భిణులు, నవజాత శిశువులు

రాజమహేంద్రవరం రూరల్,  బొమ్మూరు కు చెందిన శీలం కనక దుర్గ గర్భిణి. నెలలు నిండడంతో నవంబర్‌  25న  పురుడు పోసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. 26వ తేదీన
ఆపరేషన్‌ చేయగా  ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన నవజాత శిశువుకు మంగళవారం వ్యాక్సిన్‌ వేశారు. సాయంత్రం పాపకు జ్వరం రావడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే  డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లగా వ్యాక్సిన్‌ వేసిన పాపకు జ్వరం అలానే  వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అయితే రాత్రంతా పాప జ్వరంతో  బాధపడగా 27వ తేదీ మధ్యాహ్నం ఆమెను డాక్టర్ల వద్దకు తీసుకువెళితే మృతి చెందినట్టు చెప్పారు. డాక్టర్లు పాపను పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందినట్టు ఆరోపించి ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి , తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లీబిడ్డల విభాగంలో మాతా శిశుమరణాలు తగ్గడం లేదు. ఈ ఆసుపత్రిలో వారంలో ఎవరో ఒకరు మృత్యువాతపడుతూనే ఉన్నారు. ప్రభుత్వ డాక్టర్లు తమ తప్పులేదని చేతులు దులుపుకొంటున్నా భారీ మూల్యం చెల్లించేది మాత్రం రోగులే. డబ్బులు పెట్టి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని ఎందరో ఈ ఆసుపత్రికి వస్తున్నా.. ఇక్కడ వైద్యం అందని ద్రాక్షగానే ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన పెన్నింటి నాగలక్ష్మి నవంబర్‌  14న పురుడు కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 15వతేదీ డ్యూటీ డాక్టర్‌ శాంతి ప్రియ ఆపరేషన్‌ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్‌ చేసి బిడ్డను తీయడం వల్ల కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారు. మధ్యాహ్నం బాత్‌ రూమ్‌కు వెళ్లేందుకు బెడ్‌ నుంచి కిందకి దిగిన నాగలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. బాలింతలకు సమీపంలో బాత్‌ రూమ్‌లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని నాగలక్ష్మి బంధువులు ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, పురుడుపోసుకునేందుకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ఒకే సారి సీనియర్‌ సిబ్బందిని బదిలీచేయడంతో గైనిక్‌ విభాగంలో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రోగులు పేర్కొంటున్నారు. గర్భిణులకు పరీక్షలు చేసే సమయం కూడా సిబ్బందికి ఉండడం లేదు. రోజుల  తరబడి పురుడుపోసుకునేందుకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రçసూతి విభాగంలో ప్రస్తుతం ఏడుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ఒక డాక్టర్‌ మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. మిగిలిన ఆరుగురు డాక్టర్లలో ఒకరు రాత్రి సమయాల్లో డ్యూటీ నిర్వహించేందుకు కేటాయించగా ఐదుగురు రోజు వారీ విధులు నిర్వహిస్తుంటారు. రోజుకు కనీసం 10 నుంచి 15 వరకు పురుళ్లు  పోయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. విపరీతమైన ఒత్తిడిలో డాక్టర్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. వీటితోపాటు గర్భిణుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తి వారికి రక్తం ఎక్కించడంలో  జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో తల్లి గాని నవజాత శిశువుల గాని మృత్యువాత పడుతుండడం సర్వసాధారణమైంది.

ఒకేసారి సిబ్బంది బదిలీ
వైద్య విధాన పరిషత్‌లో సిబ్బంది బదిలీలు రోగుల పాలిట శాపంగా మారింది. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన వారిని బదిలీలు చేయడం వల్ల రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న 69 మందిని ఒకే సారి బదిలీలు చేయడం వల్ల పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా వైద్య సేవలు పొందేందుకు వస్తుంటారు. వీరితో పాటు రోజు సుమారు 600 మంది వరకు అవుట్‌ పేషంట్లు వస్తుంటారు. వారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. ఇక్కడ పని చేసే నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్‌ అటెండెంట్, ఇద్దరు ఓటీలు, 15 మంది స్టాఫ్‌ నర్సులు, ఏడుగురు ట్రామా కేర్‌ సిబ్బంది, ఏడుగురు ఎంఎన్‌ఓలు, నలుగురు ఎఫ్‌ఎన్‌ఓలు, ఒక జేఎస్‌డబ్ల్యూ, జిల్లా కేడర్‌కు చెందిన 44 మంది, జోనల్‌ కేడర్‌కు చెందిన 25 మంది  మొత్తం 69 మంది సిబ్బంది బదిలీ అయ్యారు. దీంతో మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు.

కొత్త ఐసీయూ ఏర్పాటు చేశాం
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో కొత్తగా ఐసీయూ ఏర్పాటు చేశాం. డాకర్లు, సిబ్బంది కొరత ఉంది. కనీసం 10 మంది డాక్టర్లు, మరో 20 మంది స్టాఫ్‌ నర్సులు ఉండాలి. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఎక్కువ సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహించిన వైద్య సిబ్బందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశాం. కొత్తవారు విధుల్లోకి చేరారు.  ఉన్న వారితో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.– టి.రమేష్‌ కిశోర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top