పాత క్లస్టర్లలోనే ఎక్కువ కేసులు

More Corona cases in older clusters says Jawahar Reddy - Sakshi

వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి గతంలో గుర్తించిన పాత క్లస్టర్లలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల్లో కొత్తగా 62 కేసులు నమోదైతే ఇందులో 46 కేసులు పాత క్లస్టర్లలోనే వచ్చాయన్నారు. ఇప్పటివరకు 955 పాజిటివ్‌ కేసుల్లో 642 నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని.. ఇందులో అత్యధికంగా కర్నూలులో 261, గుంటూరులో 206, కృష్ణాలో 102, చిత్తూరులో 73 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► 24 గంటల్లో 6,306 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా  62 పాజిటివ్‌ వచ్చాయి.
► రాష్ట్రంలో సగటున ప్రతి మిలియన్‌కు 1,018 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 
► కొత్తగా 10 క్లస్టర్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో అర్బన్‌ (సామర్లకోట, విజయవాడ) ప్రాంతాల్లో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో (ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో) ఎనిమిది క్లస్టర్లలో వచ్చాయి.
► రెడ్‌జోన్‌లోకి తాజాగా చిత్తూరు జిల్లా ఏర్పేడు, పుత్తూరు, వరదాయపాళెం, వైఎస్సార్‌ జిల్లాలో చింతకొమ్మదిన్నె మండలాలు చేరాయి. 
► కరోనా క్లస్టర్‌ జాబితాలో కొత్తగా 7 మండలాలు చేరాయి. దీంతో కరోనా కేసులున్న మండలాల సంఖ్య 110కి చేరింది.
► వరుసగా రెండుసార్లు అంటే 14వ రోజు, 15వ రోజు నెగటివ్‌ వస్తేనే డిశ్చార్జ్‌ చేస్తాం. ఇలా 100 మంది డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారు.
► కర్నూలు జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అందుకే ఐఏఎస్‌ అధికారి హరినారాయణ, డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసరావును అక్కడకు పంపించాం.
► నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం.

ఆయాసం ఉంటే ప్రభుత్వాసుపత్రికి వెళ్లండి
ఆయాసంతో బాధపడుతున్న వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన పరీక్షలు నిర్వహించుకుని ఆయాసానికి కరోనా కారణం కాదని నిర్ధారించుకోవాలని సూచించారు.  

‘ట్రూనాట్‌’ పాజిటివ్‌ వస్తే కోవిడ్‌ ఆస్పత్రికి..
ఆస్పత్రిలో చేర్చాక ఆర్టీపీసీఆర్‌ టెస్టులు
రాష్ట్ర వ్యాప్తంగా 225 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు చేసిన వారిలో 60 ఏళ్లు దాటిన వారికి పాజిటివ్‌ వస్తే వెంటనే వారిని జిల్లా లేదా స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రులకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆస్పత్రిలో చేరాక తిరిగి ఆర్టీపీసీఆర్‌ (వైరాలజీ ల్యాబ్‌లో) టెస్టులు చేయాలని వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top