ముందుగానే రుతుపవనాలు! | Monsoons will be early this time | Sakshi
Sakshi News home page

ముందుగానే రుతుపవనాలు!

Apr 11 2018 3:22 AM | Updated on Apr 11 2018 3:22 AM

Monsoons will be early this time - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సానుకూల సంకేతాలు అగుపిస్తున్నాయి. వేసవి ఆరంభం(మార్చి ఆఖరు)లోనే క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించడం, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురవడం వంటి పరిణామాలు ముందస్తు రుతుపవనాలకు దోహదం చేయనున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి జూన్‌ మొదటి తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంది.

కానీ అంతకంటే ఐదు నుంచి 8 రోజుల ముందుగానే ఇవి కేరళను తాకుతాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి నీటి ఆవిరి కలిగిన మేఘాలు భూమధ్యరేఖ దాటి ఉత్తరార్థ గోళంలోకి ప్రవేశిస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో యాంటీ సైక్లోన్లు(అధిక పీడనాలు) బలంగా ఉన్నాయి. ఇవి దక్షిణం వైపు నుంచి తేమ గాలులతో తూర్పు, పశ్చిమతీరాలకు వస్తున్నాయి. ఫలితంగా ఈ ఎండాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల(వాతావరణ పరిభాషలో థండర్‌ స్టార్మ్‌ యాక్టివిటీగా పిలుస్తారు)కు కారణమవుతున్నాయి. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించేందుకు దోహదపడే పశ్చిమ ఆటంకాలు ఉత్తరం వైపునకు కదులుతున్నాయి. 

అనుకూలంగా లానినా పరిస్థితులు.. 
సాధారణంగా పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే ఎల్‌నినో ఏర్పడి వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. అదే ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే లానినా పరిస్థితులు ఏర్పడతాయి. అంటే రుతుపవనాలకు అనుకూలమన్నమాట. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల లానినా పరిస్థితులేర్పడి జూన్‌ దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నైరుతి రుతుపవనాలు ముందస్తు ఆగమనానికి అనుకూల పరిణామమని రిటైర్డ్‌ వాతావరణ శాస్త్రవేత్త రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి జూన్‌ మొదటితేదీకి 5 నుంచి 8 రోజుల ముందుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే వీలుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సా«ధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ ప్రకటించడం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement