
ప్రజాసంకల్పయాత్ర నుంచి..
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు సర్కారుకు దడ పుడుతోందని విజయనగరానికి చెందిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తెలుగుదేశం నేతలకు నోటిమాట రావడం లేదన్నారు. జగన్ పాదయాత్రకు ప్రారంభంలో ఏ విధంగా స్పందన ఉందో పది జిల్లాలు పూర్తిచేసుకుని పదకొండో జిల్లాలోకి అడుగు పెడుతున్న సందర్భంలోనూ అదే స్పందన లభిస్తుండడం విశేషమన్నారు.
మంగళవారం ఆయన ఆనందపురం మండలం ముచ్చెర్ల వద్ద పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిశారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబును ఎప్పుడు గద్దెదించుదామా అన్న ఆతృతలో రాష్ట్రప్రజానీకం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. ఈనెల 23న విజయగనరం జిల్లా చింతలవలసలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఆదేరోజు కొత్తవలసలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఘనంగా ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.