సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి...
మండలంలోని చిరుమామిళ్ళ గ్రామం జిల్లాలోనే రాజకీయ చైతన్యానికి ఆలవాలమైన గ్రామం.
* రేపు నాలుగో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ
* హాజరుకానున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి
చిరుమామిళ్ళ (నాదెండ్ల): మండలంలోని చిరుమామిళ్ళ గ్రామం జిల్లాలోనే రాజకీయ చైతన్యానికి ఆలవాలమైన గ్రామం. గ్రామానికి చెందిన దొడ్డా బాలకోటిరెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. 1989 నుంచి 1994 వరకూ సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన దొడ్డా కోటిరెడ్డి, అప్పమ్మ దంపతుల కుమారుడు బాలకోటిరెడ్డి.
ఈయన స్వగ్రామం రాజుపాలెం మండలం కోటనెమలిపురి. చిన్నతనంలోనే చిరుమామిళ్ళకు దత్తతకు వచ్చారు. ఈయన చిరుమామిళ్ళ గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1972 మే నెలలో చిరుమామిళ్ళ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. 1987లో యడ్లపాడు మండలానికి తొలి ఎంపీపీగా పనిచేశారు. గుం టూరు జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా పనిచేస్తూ అప్పటి చైర్‌పర్సన్ దొడ్డపనేని ఇందిర ఆకస్మిక మరణంతో ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు.
అనంతరం గుంటూరు మార్కెట్‌యా ర్డు చైర్మన్‌గా కొనసాగుతూ 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆయన హయాంలో జిల్లా పరిషత్‌లోనూ, సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రజల మన్ననలుపొందారు. 2012 జనవరి 30వ తేదీన స్వగ్రామమైన చిరుమామిళ్ళలో తుదిశ్వాస విడిచారు.
విగ్రహావిష్కరణకు జగన్ రాక
దొడ్డా బాలకోటిరెడ్డి నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2013 మార్చి 12న మహాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈ ప్రాంతంలో పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
అప్పట్లో దొడ్డా బాలకోటిరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్‌మోహనరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలన్న గ్రామస్తుల కోరిక ఈ నెల 11వ తేదీన నెరవేరనుంది. మధ్యాహ్నం 3 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నేతలతో పాటు గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


