ఏపీ సమస్యల ప్రస్తావనకు సమయమివ్వండి 

Mithun Reddy seeks time to Mention of AP issues with Lok Sabha Speaker on all-party visit - Sakshi

అఖిలపక్ష భేటీలో లోక్‌సభ స్పీకర్‌ను కోరిన మిథున్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను లేవనెత్తేందుకు తగిన సమయం కేటాయించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు. శనివారం ఢిల్లీలో స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి, వైఎస్సార్‌ సీపీ, ఫ్లోర్‌లీడర్‌ మిథున్‌రెడ్డి సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్‌ కోరారు.

ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం మంజూరు చేయాల్సిన నిధులు, ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు, పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణ దూరం పెంపు, కొత్త మెడికల్‌ కాలేజీల సాధనపై పోరాడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా ఎంపీలు కలసికట్టుగా కృషి చేస్తారని మిథున్‌రెడ్డి మీడియాకు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top