మగ్గూరు జాబితా తప్పుల తడక!

Mistakes in Srikakulam magguru Voterlist - Sakshi

మరణించిన వారి పేర్లు తొలగింపులో బీఎల్‌ఓలు విఫలం

రాజాం ఎమ్మెల్యే జోగులు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వాస్తవాలు తేటతెల్లం

శ్రీకాకుళం, వంగర: మండలంలోని మగ్గూరులో టీడీపీ నేతల బెదిరింపులకు బూత్‌ లెవెల్‌ అధికారు(బీఎల్‌ఓ)లు తలొగ్గారు. ఏ ఒక్క ఓటరును తొలగించవద్దని, వైఎస్సార్‌ సీపీ అభిమాన ఓటర్లను చేర్చవద్దని బీఎల్‌ఓలకు బెదిరింపులకు పాల్పడడంతో ఇంత వరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్క ఓటు నమోదు చేయలేదు. అలాగే గత పదేళ్లుగా ఓటర్లు జాబితా ప్రక్షాళన చేయకపోవడమే బీఎల్‌ఓలు ఇక్కడ టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అన్యాయంగా తప్పుడు ఓట్లును ఇంత వరకు కొనసాగించారనే విమర్శలు గ్రామ ప్రజల్లో నెలకొంది. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మగ్గూరు ఓటర్లు జాబితాను ప్రక్షాళన చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంలో మండల రెవెన్యూ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించడంపై రాజకీయ కోణం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

నేతల ఒత్తిడే కారణం
టీడీపీ నేతలు ఒత్తిడి కారణంగా తప్పుల తడకగా ఉన్న ఓటర్లు జాబితాను సవరణ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గత కొన్నేళ్లులో ఏ ఒక్క ఓటును కూడా సవరణ చేయకపోవడమే అధికార పార్టీ నేతల దుర్మార్గపు చర్యకు పరాకాష్టగా అభివర్ణించవచ్చునని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గ్రామానికి చెందిన ఓటర్లు జాబితాలో 1400 ఓట్లకు పైగా ఉండగా అందులో 173 ఓట్లు తొలగించాల్సి ఉన్నాయి. మరణించిన ఓట్లు–67, పెళ్లి అయిన ఓట్లు–34, డబుల్‌ ఎంట్రీ–16, వేరే గ్రామంలో స్థిరపడిన వారు–35, గ్రామానికి సంబంధం లేనివారు–20 మంది ఉన్నారని, ఈ ఓట్లు తొలగింపునకు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేతలు పోలిరెడ్డి రామకృష్ణ, కొచ్చెర్ల తవిటయ్య, బూరెడ్డి సంగంనాయుడు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండి పడుతున్నారు.

ఉలిక్కిపడిన అధికారులు
ఈ విషయంపై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత గంటా ఖగేంద్రనాయుడు ఒత్తి డి వల్లే ఓటర్లు జాబితా సవరణ జరగడం లేదని, ఇది అన్యాయమని, తక్షణమే జాబితా ప్రక్షాళన జరగాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు బీఎల్‌ఓల తీరును ఎండగడుతూ గ్రామంలో దర్యాప్తు నిర్వహించారు. ఓటర్ల జాబితాను పరిశీలించిన అనంతరం రెవెన్యూ అధికారులు అవాక్కయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top