తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు

Missing Boy At The Childline Office - Sakshi

విజయనగరం ఫోర్ట్‌ : ఇంటి నుంచి పారిపోయిన బాలుడిని చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ సభ్యులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే... తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన విశాఖపట్నం ఆరిలోవకు చెందిన అహముల్లా జైబుల్‌ రైలు ద్వారా మంగళవారం విజయనగరం వచ్చేశాడు. రాత్రి 8:30 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్‌ ట్రోల్‌ఫ్రీ నంబర్‌ 1098కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు.

వెంటనే సిబ్బంది బాలుడ్ని చైల్డ్‌లైన్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. బుధవారం బాలుడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉన్న చైల్డ్‌లైన్‌ కార్యాలయానికి రావడంతో బాలుడిని చైల్డ్‌లైన్‌ సభ్యులు బాలల సంక్షేమ కమిటి ముందు ప్రవేశ పెట్టారు. కమిటీ చైర్మన్‌ ఆదేశానుసారం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ వావిలాల లక్ష్మణ్, సభ్యులు పట్నాయక్, చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ కో ఆర్డినేటర్‌ ఎస్‌. రంజిత, సతీష్, కృష్ణారావు, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top