ఇంటిని వదిలి హిజ్రాల వలలో చిక్కుకున్న పదమూడేళ్ల బాలుడు ఎట్టకేలకు తల్లి చెంతకు చేరాడు
- ఐదు రోజుల తర్వాత తల్లి చెంతకు
వెంకోజీపాలెం (విశాఖ తూర్పు) : ఇంటిని వదిలి హిజ్రాల వలలో చిక్కుకున్న తగరపువలసకు చెందిన పదమూడేళ్ల బాలుడు ఎట్టకేలకు తల్లి చెంతకు చేరాడు. వివరాల్లోకి వెళ్తే..భీమిలి మండలం చిట్టివలస గ్రామం పెరుకువీధికి చెందిన జీరు రెడ్డి (13) తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో మధ్యలోనే చదువు ఆపేశాడు. అనంతరం తన బాబాయ్ నూడుల్స్ దుకాణంలో చేరి తల్లికి చేదోడుగా ఉండేవాడు.
శనివారం ఎప్పటిలాగే పనికి వెళ్లినా రాత్రి ఇంటికి చేరకపోవడంతో బాలుడి తల్లి భీమిలి పోలీసులను ఆశ్రయించింది. బాలుడి కోసం తల్లితో పాటు బంధువులు కూడా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం ద్వారకానగర్ బస్‌స్టేషన్ సిగ్నల్ పాయింట్ వద్ద హిజ్రాలతో ఉన్న జీరు రెడ్డి తల్లికి కనిపించాడు. వెంటనే తల్లి వారి వద్దకు చేరుకుని ఎందుకు తన కొడుకుని ఇలా చేశారని ప్రశ్నించడంతో.. ‘‘మేం మీ అబ్బాయిని ఏమీ చేయలేదు. రోడ్డు మీద కనిపించి ఆకలిగా ఉందనడంతో మాతో తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాం.’’ అని హిజ్రాలు బదులిచ్చారు. అనంతరం బాలుడిని తల్లికి అప్పగించారు.