అర్ధరాత్రీ అడిగినంత మద్యం!

mid night also wine available in vijayawada - Sakshi

బెల్టు షాపుల ద్వారా జోరుగా మద్యం అమ్మకాలు

హైవేలపైనే విచ్చలవిడిగా ‘బెల్టు’ దుకాణాలు

‘ఫార్సు’లా మారిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు

ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల నుంచి బెల్టు షాపుల ద్వారా తెలంగాణకు భారీగా మద్యం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ తనిఖీలు ‘ఫార్సు’లా మారాయి. మద్యం సిండికేట్లు అర్ధరాత్రి వేళల్లోనూ జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న మద్యం షాపులు తెల్లవారుజాము వరకు అమ్మకాలు సాగిస్తున్నా.. ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు బెల్టు షాపులపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం ఎక్సైజ్‌ శాఖ నిర్లిప్తతకు అద్దం పడుతోంది. మద్యం సిండికేట్లకు ప్రయోజనం కలిగించడానికే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ పోస్టును గత ఆర్నెల్లుగా సర్కారు భర్తీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం షాపులు, బార్ల పక్కనే బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి సిండికేట్లు అమ్మకాలు సాగిస్తున్నారు.

పగలూ, రాత్రీ తేడా లేకుండా సాగుతున్న అమ్మకాలతో సర్కారు ఖజానా నింపుకునే పనిలో ఉంది. ఏడాది ఆఖరు కావడంతో ఈవెంట్‌ పర్మిట్లు కూడా ఇచ్చేందుకు ఎక్సైజ్‌ అధికారులు ప్రతిపాదనలు కోరుతున్నారు. ఇటు అధికార పార్టీ నేతల పర్యటనలకు మద్యం సరఫరా పూర్తిగా బెల్టు షాపుల నుంచే జరుగుతోంది. గురజాల నియోజకవర్గంలో బెల్టు షాపులు ఏర్పాటు చేసి మరీ మద్యం సరఫరా చేస్తున్నా.. ఎక్సైజ్‌ శాఖ చేష్టలుడిగి చూస్తోంది.

మద్యం షాపులు, బార్లకు మద్యం బాటిళ్ల నిల్వలకు గోడౌన్లకు ఎక్సైజ్‌ అధికారులు అనుమతులిస్తున్నారు. ఈ గోడౌన్ల కేంద్రంగానూ బెల్టు షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతుండటం గమనార్హం. రైల్వే స్టేషన్ల పరిసరాలు, రైల్వే యార్డుల్లో బెల్టు షాపులు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగిస్తున్నారు. విజయవాడలోని రాయనపాడు రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాపు పరిధిలో బెల్టు అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నాయి.

గుంటూరు– విజయవాడ రహదారి పక్కన  మద్యం షాపులు, బార్ల పక్కనే బెల్టు అమ్మకాలు సాగిస్తున్నారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో సముద్ర స్నానాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందిగా బీచ్‌లలోనే బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. బాపట్ల, సూర్యలంక, చీరాల వద్ద రామాపురం ప్రాంతాల్లో బెల్టు అమ్మకాలు సాగుతున్నాయి. 

డ్యాష్‌ బోర్డులో కనిపించని బెల్టు కేసులు
సీఎం కోర్‌ డ్యాష్‌ బోర్డులో బెల్టు షాపుల దాడులు, కేసులపై వివరాలు కనిపించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో బెల్టు షాపులు అసలేవీ లేవని ప్రచారం చేసుకునేందుకు మాత్రమే ఈ ఏడాది మే నెల తర్వాత ఈ వివరాలను ప్రకటించడం లేదని అవగతమౌతోంది.

ఈ ఏడాది ప్రారంభంలో బెల్టు షాపులపై ఫిర్యాదులకు 1100 నంబరు ప్రకటించి.. కొద్ది నెలల తర్వాత ఫిర్యాదులను తీసుకోవడం మానేశారు. ఎవరైనా 1100 నంబరుకు ఫిర్యాదు చేస్తే, వారి ఆధార్‌ నంబరు, పూర్తి వివరాలు చెప్పాలని కాల్‌ సెంటర్‌ ప్రతినిధులు ఒత్తిడి చేయడం గమనార్హం. 

తెలంగాణకు భారీగా తరలుతున్న మద్యం
తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దు జిల్లాల నుంచి మద్యాన్ని భారీగా తరలిస్తున్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు ఏపీలోని సరిహద్దు జిల్లాలైన గుంటూరు, కృష్ణా, కర్నూలులో బెల్టు షాపుల నుంచే మద్యం తరలిపోతోంది. 

రాష్ట్రంలో 15,719 బెల్టు షాపులపై కేసులు: ఎక్సైజ్‌ కమిషనర్‌
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,719 బెల్టు షాపులపై కేసులను నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీనరసింహం తెలిపారు. మొత్తం 16,114 మందిని అరెస్టు చేశామన్నారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న 493 మద్యం షాపులపైనా, 22 బార్‌ల పైనా కేసులు పెట్టామన్నారు. 106 మద్యం షాపులు, 5 బార్‌లను సస్పెండ్‌ చేసి విచారణ ప్రారంభించామన్నారు. బెల్ట్‌షాపులపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top