యురేనియం గ్రామాలకు మహర్దశ 

Measures To Implement Micro Irrigation In Uranium Villages - Sakshi

సూక్ష్మ సేద్యం అమలు చేసే దిశగా చర్యలు  

గ్రామాల్లో పర్యటించిన జైన్‌ కంపెనీ బృందం

సాక్షి, వేముల: యురేనియం గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఇక్కడ సూక్ష్మ సేద్యం అమలు చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు. దీంతో జైన్‌ కంపెనీ ప్రతినిధులు మంగళవారం యురేనియం గ్రామాలలో పర్యటించారు.కాగా మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధిచేసి వ్యర్థ పదార్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టైలింగ్‌ పాండ్‌కు తరలిస్తున్నారు. ఇందులోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. టైలింగ్‌ పాండ్‌ నిర్మాణంలో యూసీఐఎల్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని బాధితుల ఆరోపణ.. టైలింగ్‌పాండ్‌ వ్యర్థాలతో యురేనియం కాలుష్యం వెలువడుతోంది. వ్యవసాయ బోర్లలోని నీరు కలుషితం అవుతున్నాయి. దీంతో సాగులో ఉన్న అరటి, వేరుశనగ పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అంతేకాక చర్మ వ్యాధులు సోకుతున్నాయి. గత కొన్ని నెలలుగా బాధిత రైతులు యూసీఐఎల్‌ తీరుకు నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు.  

గ్రామాల్లో పర్యటించిన జైన్‌ కంపెనీ బృందం :  
మండలంలోని తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, కె.కె.కొట్టాల, వేల్పుల గ్రామాల్లో జైన్‌ కంపెనీ బృందం పర్యటించింది. జైన్‌ ప్రాజెక్టు ఇంజినీర్లు సుదన్షు, కృష్ణ, నీటిపారుదల శాఖ జేఈలు వాసుదేవారెడ్డి, ప్రదీప్‌రెడ్డి సూక్ష్మ సేద్యం అమలుపై పరిశీలించారు. ఈ గ్రామాలలో సుమారు 10వేల ఎకరాలకుపైనే సూక్ష్మ సేద్యం అమలు చేయనున్నారు. ఇందుకోసం రోజుకు ఎంత నీరు అవసరమవుతుంది.. 200ఎకరాలకు ఒక సంప్‌ నిర్మించాలా, 500ఎకరాలకు,.. 2వేల ఎకరాలకు ఒక్కో సంప్‌ నిర్మించాలా అనే దానిపై సర్వే చేసినట్లు జేఈ వాసుదేవారెడ్డి తెలిపారు.  

మబ్బుచింతలపల్లెలో భూములను పరిశీలిస్తున్న జైన్‌ కంపెనీ బృందం, నీటిపారుదల శాఖ అధికారులు  

సూక్ష్మ సేద్యం అమలుకు చర్యలు.. :  
యురేనియం గ్రామాల్లో సూక్ష్మసేద్యం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ బోర్లతో నిమిత్తం లేకుండా సంప్‌ల ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక టీఎంసీ సామర్థ్యంతో గిడ్డంగివారిపల్లె సమీపంలో రిజర్వాయర్‌ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. టైలింగ్‌ పాండ్‌ వ్యర్థ జలాలు కలుషితం కావడంతో వ్యవసాయం దెబ్బతింది. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ యురేనియం గ్రామాలకు పార్నపల్లె నీటిని పైపులైన్‌ ద్వారా తీసుకొచ్చి రిజర్వాయర్‌కు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలతో అధికారుల సర్వే చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top