కోదండరామాలయ ప్రగతికి మాస్టర్ ప్లాన్ | master plan | Sakshi
Sakshi News home page

కోదండరామాలయ ప్రగతికి మాస్టర్ ప్లాన్

Feb 21 2015 1:26 AM | Updated on Sep 2 2017 9:38 PM

గత కొంత కాలంగా మండల ప్రజలు కోరుకుంటున్న అధికారిక బ్రహ్మోత్సవాల శోభ శుక్రవారం ఒంటిమిట్టను తాకింది.

ఒంటిమిట్ట: గత కొంత కాలంగా మండల ప్రజలు కోరుకుంటున్న అధికారిక బ్రహ్మోత్సవాల శోభ శుక్రవారం ఒంటిమిట్టను తాకింది. స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ శుక్రవారం పరిశీలించారు.
 
  వీరు ముందుగా కోదండరామున్ని దర్శించుకున్నారు. వీరి రాక సందర్భంగా పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కోదండరామాలయానికి అధికారిక హోదా తీసుకొస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానిక భక్తులు, నాయకులు, ప్రజలు పూలతో స్వాగతం పలికారు. అనంతరం కోదండరామాలయ పరిసర ప్రాంతాలను, ఆలయానికి సంబంధించిన భూములను ప్రిన్సిపాల్ సెక్రటరీ పరిశీలించారు.
 
  ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రభుత్వ మేడా విలేకరులతో మాట్లాడుతూ ప్రాచీన ఆలయమైన ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఎలాంటి నూతన కట్టడాలకు తావులేదన్నారు. ఆలయ స్థితిని యధావిధిగానే కొనసాగించాలన్నారు. దేవాలయంలో ఒక పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించాలని సూచించారు. ఆలయానికి ఇచ్చే కానుకలను నగదు రూపంలో అందించాలని తెలియచేశారు. ఆలయంలో దాతల పేర్ల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయకూడదని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టే కట్టడాలను ఎక్కడికక్కడ ఆపాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ద్వారా ఒంటిమిట్ట కోదండరామాలయం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆలయంలో పాడుబడ్డ శిల్పాలను మద్రాసులోని ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలచే మరమ్మతులు చేయిస్తామన్నారు.
 
 ఘనంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
 నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగే బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ రెవెన్యూ, ఎండోమెంట్ ప్రిన్పిపల్ ఏవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఇందు కోసం ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు, ప్రజలతో ఆయన చర్చించారు. ఒంటిమిట్ట కోదండరామాలయం రాబోయే కాలంలో ఒక గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
 
 పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి
 ముఖ్యంగా మండలంలో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ప్రిన్సిపాల్ సెక్రటరీ వె ల్లడించారు. కోదండరామాలయానికి ఆనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించడం వలన ఒంటిమిట్టలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కోదండరామాలయానికి వచ్చే యాత్రికులకు ప్రత్యేక వసతి కల్పించడం ద్వారా పర్యాటక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఒంటిమిట్ట మండలంతో పాటు జిల్లాను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
 
 భావి తరాలపై పురాతన ఆలయాల చరిత్ర తెలుసుకునే విధంగా ఆలయాలను యధాస్థితిలో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన భవనాలను, ఆలయసమీపంలోని హరితా రెస్టారెంట్‌ను, కోదండరామాలయ భూములను, రామలక్ష్మణ తీర్థాలను పరిశీలించారు. వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, వీఐపీలకు ఏర్పాట్లు, భక్తుల ఏర్పాట్లపై చర్చించారు. వీటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. స్థానిక ప్రజలు, భక్తులసహకారంతో అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు, నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement