ఇక్కడంతా... ఓపెన్‌

Mass Copying in Open School Exams East Godavari - Sakshi

దూర విద్య పరీక్షల్లో చూచిరాతలు

అయినవారే పరీక్షల పర్యవేక్షకులు

ఒక్కోఅభ్యర్థి నుంచి రూ.500 వరకూ వసూలు

విద్యాశాఖాధికారుల నిర్వాకం

తూర్పుగోదావరి, కాకినాడ సిటీ:  ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో చూచి రాతలు జిల్లాలో ఓపెన్‌గా జరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ముందుగానే సంబంధిత నిర్వాహకులు ‘డీల్‌’ కుదుర్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాస్‌ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు పరీక్ష రాస్తున్న అభ్యర్థులే నేరుగా చెబుతున్నారు. పరీక్ష రాసే సెంటర్లోనే ఒక్కో అభ్యర్థి నుంచి రూ.300 నుంచి రూ.500 వరకూ వసూలు చేస్తున్న విషయం గుప్పుమంటోంది. ముందుగా పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా అభ్యర్థులకు నేరుగా స్లిప్పులను అందజేస్తున్నారు. దీనికోసం ఒక్కో గదిలో మూడు నుంచి నాలుగు టెస్ట్‌ పేపర్లు పెట్టుకుంటున్నట్లు సమాచారం. బయట నుంచి ఎవరైనా పర్యవేక్షణకు వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించేదిలేదని అక్కడున్న ఇన్విజిలేటర్లే స్వయంగా ఎదురొచ్చి చెప్పేస్తున్నారు.

జిల్లాలో 27 సెంటర్లలో 8,601 మంది అభ్యర్థులు పదో తరగతి పరీక్షలు, 35 కేంద్రాల్లో11,521 మంది అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ పరీక్షలను రాస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ పరీక్షలు లోపభూయిష్టంగానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్వాకం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందంటున్నారు. విద్యార్థులు చదివే సెంటర్లకు చెందిన ఉపాధ్యాయులనే పర్యవేక్షకులుగా నియమించి మరోసారి విద్యాశాఖ అధికారులు విమర్శల పాలయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో పరీక్షల నిర్వాహకులు తమకు కావాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించి వారి ద్వారా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరైతే ‘పరీక్షల్లో పాస్‌ కావాలి ... అన్ని విధాలా సహకరిస్తే రూ.15 వేల వరకూ ముట్టజెబుతామ’ని ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా కొంతమొత్తం అడ్వాన్స్‌గా కూడా అందజేస్తున్నారు. ఈ పరీక్షలు పదోన్నతుల కోసమో, లేక ఉద్యోగాలు చేస్తున్న వారు అర్హత పొందేందుకో రాస్తారు తప్ప ఉన్నత చదువుల కోసం కాదు కదా...అందుకే అంత సీరియస్‌గా దృష్టి పెట్టం అని నిర్వాహకులే చెబుతుండడం గమనార్హం. జిల్లా విద్యాశాఖ అధికారులకు డబ్బులు ఇస్తే సర్టిఫికెట్‌ తమకు వచ్చేస్తుందని అభ్యర్థులు ధీమాగా చెబుతున్నారంటే ఈ పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్ధం అవుతుంది.

ఈ సర్టిఫికెట్లకు ఎంతో విలువ...
ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీలో పదో తరగతి, ఇంటర్‌ మీడియట్‌ సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా చదివే విద్యార్థులకు ఉన్నంత విలువ ఉంది. ఈ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు, పదోన్నతులు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అనేక మంది ఓపెన్‌ స్కూల్స్‌ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. నామమాత్రపు ఫీజుతో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరిన తరువాత వార్షిక పరీక్షల్లో నిర్వాహకులు అడిగినంత ముట్టజెబితే దర్జాగా సర్టిఫికెట్లు వచ్చి చేతిలో పడతాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాన్ని నిర్వాహకులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌గా మారిపోయింది.

సెంటర్‌లోనే రాయ ‘బేరాలు’...
జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌కు సంబంధించి 62 సెంటర్లున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ చదివే వారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఏడాదికి 24కి తగ్గకుండా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. పదో తరగతి చదవాలనుకునేవారికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా 14 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సున్నా అర్హులే. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి 15 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సున్నా అర్హులే. ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. వారిలో ఒకరు ప్రధానోపాధ్యాయులుగా, సెంటర్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. తాము నిర్వహించే సెంటర్లలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు వచ్చే వారి వివరాలను, ఎలాంటి అవసరార్థం కోసం చేరుతున్నారో ముందుగానే తెలుసుకొని అక్కడి నుంచే రాయ‘బేరాలు’ సాగిస్తుంటారు.

జోరుగా కాపీయింగ్‌...
జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం ప్రధాన కేంద్రాల్లో పరీక్ష రాసే వారికి ఇన్విజిలేటర్లే ఎంచక్కా గైడ్లను  అందజేస్తున్నట్లు పరీక్ష రాసి వచ్చే విద్యార్థులు చెబుతున్నారు. ఓపెన్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం ... కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు పత్రికలకే పరిమితమవుతున్నాయిగానీ ఆచరణలో అవేవీ కనిపించడం లేదని అభ్యర్థులే చెప్పడం గమనార్హం.

ఎక్కడో చెబితే చర్యలు తీసుకుంటాం: డీఈవో అబ్రహం
ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని, అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లి వివరణ కోరగా, ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారో చెబితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షల పర్యవేక్షణకు 12 మందితో స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని, నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు.

ఇన్విజిలేటర్‌ డ్యూటీలకు డిమాండ్‌...
జిల్లాలో జరుగుతున్న ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరీక్షల ఇన్విజిలేటర్‌ డ్యూటీలకు ఎక్కడ లేని డిమాండ్‌ ఉంది. ఏటా వేసవి సెలవుల్లో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వేసవి సెలవుల్లో ఉండే ఉపాధ్యాయులు ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష విధులకు హాజరైతే వచ్చే విద్యా సంవత్సరం ఈఎల్స్‌ పొందే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఇన్విజిలేటర్‌ డ్యూటీలంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎగిరి గంతేస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో పరీక్ష నిర్వహకులు ఒక్కో చోట అవసరానికి మించి ఇన్విజిలేటర్లను, ఓపెన్‌ స్కూల్‌ నిర్వహకులు ఏర్పాటు చేసి పరీక్ష రాసే అభ్యర్థుల నుంచి ప్రతి రోజు పరీక్షలయ్యేంత వరకూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 300 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top