కానలో కలవరం | Maoist to observe martyr's week, alert in Chattisgarh | Sakshi
Sakshi News home page

కానలో కలవరం

Jul 28 2015 1:53 AM | Updated on Oct 9 2018 2:51 PM

మన్యం గుబులుగుబులుగా ఉంది. రానున్న వారం రోజుల్లో ఎలాంటి కార్చిచ్చు రగులుతుందోనని కలవరపడుతోంది.

చింతూరు / నెల్లిపాక : మన్యం గుబులుగుబులుగా ఉంది. రానున్న వారం రోజుల్లో ఎలాంటి కార్చిచ్చు రగులుతుందోనని కలవరపడుతోంది. మావోయిస్టులు మంగళవారం నుంచి వచ్చేనెల 3 వరకూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహించనుండడమే ఇందుకు కారణం. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తూ మావోయిస్టులు వేసిన పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా కనిపిస్తున్నాయి. నెల్లిపాక మండలం మాధవరావుపేట, బండిరేవు గ్రామాల సమీపంలో జాతీయరహదారిపై కర్రలతో తాత్కాలిక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాయుద్ధంలో అమరులైన వీరుల ఆశయాలను సాధించాలని, వారి త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహించాలని పోస్టర్లు, బ్యానర్లలో పేర్కొన్నారు.
 
 కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేట్ కంపెనీలకు అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు. విప్లవ విజయంతోనే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నా రు. ఎటపాకలోని పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే బ్యానర్లు కని పించడం, నిత్యం రద్దీగా ఉండే భద్రాచలం, చర్ల రహదారిలో రెండుచోట్ల బ్యానర్లు కట్టడం విశేషం. ఛత్తీస్‌గఢ్‌లో వరుస లొంగుబాట్లతో ఆందోళన చెందుతున్న మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా క్యాడర్‌ను భారీగా రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. దళాల్లో చేరిన వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో స్థానం కల్పించి భారీ దాడులకు వినియోగించే అవకాశముందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.    వారోత్సవాల సమయంలో దాడులకు పాల్పడడం ద్వారా  ఛత్తీస్‌గఢ్ పోలీసులకు సవాల్ విసరాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు సమాచారం.
 
 గాలింపు ముమ్మరం
 వారోత్సవాల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలతో నిఘాను, అడవుల్లో గాలింపును ముమ్మరం చేశారు. పలుచోట్ల మావోయిస్టుల బ్యానర్లను, పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టులు దండకారణ్య సరిహద్దుల్లో భారీ ఘటనలకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం. దండకారణ్యంలోని దట్టమైన అటవీప్రాంత గ్రామాల్లో వారోత్సవాల సభలు నిర్వహించే అవకాశముండడంతో వాటిని అడ్డుకోవాలని పోలీసులు యత్నిస్తున్నారు.
 
 ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు నడుమ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు దంతెవాడ జిల్లా కిరండోల్ నుంచి విశాఖపట్నంకు ఇనుప ఖనిజాన్ని తరలిస్తున్న గూడ్స్‌రైలును అడ్డుకున్న మావోయిస్టులు డ్రైవర్ నుంచి వాకీటాకీలు, బ్యాటరీలను తీసుకెళ్లారు. ఈ సంఘటన తో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును జగ్‌దల్‌పూర్ వరకు మాత్రమే నడుపుతున్నట్టు సమాచారం. కాగా వారోత్సవాల సందర్భంగా ఎలాంటి విపరిణామాలు చోటు చేసుకుంటాయో, అడకత్తెరలో పోకల్లా తాము ఎలాంటి అవస్థలు పడాల్సి వస్తుందోనని మన్యవాసులు గుబులు చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement