సినిమా కష్టాలు | Management of movie theaters not provide minimum facilities | Sakshi
Sakshi News home page

సినిమా కష్టాలు

Dec 24 2013 12:16 AM | Updated on Sep 2 2017 1:53 AM

గుంటూరు నగరంలో సుమారు 25 సినిమా థియేటర్లు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 100 వరకు ఉన్నాయి.

సాక్షి, నరసరావుపేట:  ప్రతి ఒక్కరికి సినిమా అనేది ఓ వినోదం. వారంతమో లేక ఆటవిడుపుగానో  మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు తమ కష్టాలను మర్చిపోవడానికి కుటుంబ సమేతంగా సినిమాలకు వెళుతుంటారు. గుంటూరు నగరంతోపాటు, జిల్లాలోని చిన్నచిన్న పట్టణాల్లో  ఎలాంటి మెరుగైన రిక్రియేషన్ క్లబ్‌లు కానీ, పార్కులు కానీ లేకపోవడంతో ప్రజలు సేదతీరడానికి, కాలక్షేపం చేయడానికి సినిమా మినహా వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి.

ఇది ప్రజల తప్పనిసరి అవసరంగా మారింది. దీన్ని సినిమా థియేటర్ల నిర్వాహకులు పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు నలుగురు కలిసి సినిమాకు వెళితే రూ. 600లు కచ్చితంగా ఖర్చు కావాల్సిందే. సినిమాకు వెళ్తే జేబులకు చిల్లు పడుతుండటంతో మధ్యతరగతి, పేద ప్రజలు నెలకు ఒక సినిమా కూడా చూడలేక పోతున్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం నామమాత్రంగానైనా సౌకర్యాలు, వసతులు కల్పించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ డబ్బులు దండుకుంటున్నారు. వినోదం కోసం సినిమాకు వెళ్లిన ప్రజలు కష్టాలపాలవుతున్నారు.
 
 గుంటూరు నగరంలో సుమారు 25 సినిమా థియేటర్లు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 100 వరకు ఉన్నాయి. సినిమా హాళ్లల్లో వసతులు, సౌకర్యాలపై తరచూ సమీక్షిస్తుండటం, ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తే స్పందించి చర్యలు తీసుకోవడం, టికెట్ల విషయం, క్యాంటిన్‌లో తినుబండారాలు, సినిమా హాళ్లల్లో పారిశుధ్యం నిర్వహణ, వాహనాల పార్కింగ్ ధరలు ఇలా అన్ని అంశాలపై  ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే ఇవి జిల్లాలో ఎక్కడా మచ్చుకైనా అమలు కావడం లేదు. అదే రీతిలో ఉన్నతాధికారులు సమీక్షించిన దాఖలాలు కూడా లేవు. గుంటూరు నగరంలో అత్యధిక శాతం సినిమా హాళ్లు ఏసీ కలిగి ఉన్నాయి. ముఖ్య పట్టణాల్లో ఉన్న సినిమా హాళ్లలో సైతం కొన్ని ఏసీ ఉన్నాయి. అయితే వీటిలో అధికశాతం హాళ్లలో ఏసీలు పనిచేయకపోవడం, సరైన సీటింగ్ వసతి లేకపోవడం ఇలా సమస్యలు కోకోల్లలు.
 
 ప్రధానంగా కొత్త సినిమా రిలీజ్ అయితే హాలు యజమానులే బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మించి లాభపడుతున్నారు. దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి.  నిబంధనలకు అనుగుణంగా టికెట్ల ధరలు ఉండవు, రెట్టింపు ధరలకు అమ్ముతుంటారు.  సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అంటే అదీ లేదు. బైక్ పార్కింగ్‌కు రూ. 15లు వసూలు చేస్తున్నారు. థియేటర్ లోపల సినిమా మొదలవగానే వేసిన ఏసీ ఇంటర్‌వెల్ తరువాత ఏ హాలులో  పనిచేయదు. అదేమని ప్రేక్షకుడు ప్రశ్నిస్తే సినిమా చూస్తే చూడు లేకపోతే పో అని బెదిరించడం సర్వసాధారణమే. ఇక తినుబండారాల విషయానికొస్తే క్యాంటిన్ రేట్లు నింగినంటుతాయి. ప్రతిదానిపై సగటున రూ. 3 నుంచి రూ. 10 ల వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు. అంత ధర తీసుకున్నా నాణ్యమైన ఆహారాన్ని మాత్రం అందించరు. చిన్న పిల్లల కోసమని వారి కుటుంబ సభ్యులు ఏదైనా ఆహారం తీసుకెళితే వారిపై ధ్వజమెత్తి నానా హంగామా చేసి తీసుకెళ్లిన పదార్థాలను బయట పారవేయి ంచడం, లేదా, బయట తిన్న తరువాత లోనికి అనుమతించడం చేస్తున్నారు.
 
 ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
 సినిమా హాలులో అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, ఆహార పదార్థాల విక్రయాలపై రెవెన్యూ యంత్రాంగంతో పాటు నగరపాలక సంస్థ, అగ్నిమాపక , కార్మిక, తూనికలు కొలతల విభాగం తదితర శాఖలన్నీ పర్యవేక్షిస్తుండాలి. కానీ ఆయా శాఖల అధికారులు కొత్త సినిమా టికెట్లు తీసుకుని చూసీచూడనట్లు పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. సినిమాహాళ్లపై ఫిర్యాదులుఅందుతున్నాయని నరసరావుపేట ఆర్డీఓ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలుపాటించాలని ఇప్పటికే యాజమాన్యానికి చెప్పామని, వారితో సమావేశాలు నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తామని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న థియేటర్లను సీజ్ చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement