breaking news
Recreation Clubs
-
సరిహద్దుల్లోని క్లబ్బులను మూసేయాలి: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన ఛతీస్‌గఢ్, భద్రాచలం దగ్గరలోని కుంట్ల, పుదుచ్చేరిలోని యానాంలో రిక్రియేషన్ క్లబ్బులను మూసేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో విపరీతంగా కొనసాగిన జూద క్లబ్బులను రిక్రియేషన్‌లో భాగంగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మూసివేశాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులో ఉండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలను దోచుకుంటున్న ఈ క్లబులను వెంటనే మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రులను, హోం శాఖామాత్యులను కలిసి విన్నవించామన్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని క్లబ్బులను గతంలో మూసివేశారని, యానాంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్లబ్బులపై కలెక్టర్ దాడి చేసి సొసైటీని రద్దు చేసి సీజ్ చేశారని తెలిపారు. చెన్నై నగరంలో రిక్రియేషన్ పేరుతో నడిచే పేకట క్లబ్ ల గురించి కూడా త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టికి తీసుకెళతామన్నారు. -
కాయ్ రాజా..కాయ్
*మళ్లీ జడలు విప్పిన పేకాట క్లబ్బులు *రిక్రియేషన్ పేరుతో మూడుముక్కలాట *నిరుపేదలు, చిరుద్యోగులే టార్గెట్ *ఫిర్యాదు చేసినా..పట్టించుకోని యంత్రాంగాలు సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మళ్లీ పేకాట క్లబ్బులు జడలు విప్పాయి. మూడుముక్కలాటతో కోట్లల్లో టర్నోవర్ చేస్తున్నాయి. రిక్రియేషన్ పేరుతో ఏర్పాటై కేవలం పేకాటకే పరిమితమయ్యాయి. జిమ్,యోగ,స్విమ్మింగ్,ఇండోర్‌గేమ్స్ వసతులున్నాయంటూ రిక్రియేషన్ క్లబ్ పేరుతో రిజిస్ట్రర్ చేసినా.. అక్కడ మాత్రం కేవలం మూడుముక్కలాటే సాగుతోంది. చిరుద్యోగులు, వ్యాపారులు, అట్టడుగు వర్గాలు సైతం ఈ మాయా జూదంలో చిక్కుకుని రోజుల తరబడి ఇళ్లకు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. క్లబ్‌లు మూసేయాలంటూ ఇటీవల హబ్సిగూడ, కోఠి, బోయిన్పల్లిల్లో పలువురు మహిళలు పోలీస్స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో రిక్రియేషన్ పేరుతో ఏర్పడ్డ సుమారు పదిహేను క్లబ్బుల్లో ప్రస్తుతం మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. హబ్సిగూడ , సైదాబాద్, కోఠిలలోని క్లబ్‌లకు తమ భర్తలు బానిసలయ్యారని, పిల్ల ల్ని, మమ్మల్ని పట్టించుకోవటం లేదంటూ ఉ స్మానియా యూనివర్సిటీ,సుల్తాన్‌బజార్ ఠాణా అధికారులకు విన్నవించుకున్నా సరైన స్పందన రాలేదని బాధితులు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. బోయిన్‌పల్లిలో కాలనీ లోని రెండు ప్రధాన రోడ్లను మూసివేసి ఓ క్లబ్ రూట్ డైవర్షన్ చేస్తూ తమ క్లబ్‌కు వచ్చి పోయే వారికి అడ్డంకులు లేకుండా చేయటం విశేషం. కోట్లల్లో దందా ... రిక్రియేషన్ క్లబ్పేరిట పేకాట దందా కోట్లల్లో సాగుతోంది. రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున వేర్వేరు కార్డ్ రూమ్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో రూమ్‌లో 20 నుంచి 30 టేబుల్స్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కోటేబుల్పై 10 నుంచి 20 రౌండ్లు ఆడుతున్నారు. ఈ మేరకు ఒక్కో కార్డు రూమ్‌లో సుమారు 300 నుంచి 500 రౌండ్ల పేకాట సాగుతోంది. ఈ లెక్కన ఆయా కార్డు రూము రేంజ్‌ను బట్టి రౌండ్‌కు కొంత సొమ్ము చొప్పున నిర్వహకులు తీసుకుంటున్నారు. ఉదాహరణకు రూ.5 వేల కార్డు రూములో ఒక్కరోజులో 300 రౌండ్ల ఆట సాగితే నిర్వహకులకు రూ.15 లక్షల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ.10వేలు, రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల కార్డు రూమ్‌ల ఆదాయం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా రోజుకు లక్షల్లో ఆదాయాన్ని (టర్నోవర్ అయితే కోట్లలో) జేబులో వేసుకుంటున్న క్లబ్‌లు ఆయా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి భారీగానే ఖర్చు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘించినా... పోలీసులు పక్షం రోజులుగా చేస్తున్న తనిఖీల్లో లెక్కాపత్రాలు లేకుండా రూ.50 వేలకుపైగా త రలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే లెక్కపత్రాలు లేకుండానే కోట్లాది రూపాయలు రిక్రియేషన్క్లబ్లలో చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం అటు వైపు కన్నెతి చూడకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ ఈ క్లబ్‌లకు వర్తించదా..? కేసులేనా చర్యలేవి..:? బస్తీల్లో గొడవలు చేసే ఒక వ్యక్తి మూడునాలుగు కేసులలో పట్టుబడితే అతనిపై రౌడీషీట్ తెరుస్తారు. ఇక గుడుంబా విక్రయిస్తూ నాలుగైదు సార్లుకుపైగా పట్టుబడితే పీడీ చట్టం ప్రయోగిస్తారు. అలాంటిది పదుల సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించి కేసులలో ఇరుక్కున రిక్రియేషన్ క్లబ్‌లపై శాశ్వత చర్యలు తీసుకోకపోడానికి గల కారణాలు పోలీసులకే తెలియాలి. తూతూ మంత్రంగా సైదాబాద్ పరిధిలో ఫ్రెండ్స్ కల్చరల్ క్లబ్‌పై దాడి చేసి 12 మంది పేకాటరాయుల్ని అరెస్టు చేశారు. ఈ క్లబ్‌పై దాడి జరగడం, కేసులు నమోదు చేయడం కొత్తేమీకాదు. మూడు సార్లకుపైగా పేకాట కేసుల్లో పట్టుబడిన క్లబ్‌ల లెసైన్స్‌లను శాశ్వతంగా రద్దు చే స్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. స్నాచర్లకు అడ్డా... గొలుసు దొంగలకు క్లబ్‌లు అడ్డాగా మారుతున్నాయి. క్లబ్ పరిసర కాలనీలలో మహిళల మెడలోని చైన్లు తెంచుకెళ్లి వాటిని క్లబ్లో ఎవరోఒకరి వద్ద కుదువ పెట్టడం, వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం స్నాచర్ల రోజు వారి విధిగా మారింది. స్నాచింగ్ జరిగిన వెంటనే చుట్టుపక్క ఠాణాల పోలీసులు అప్రమత్తమై గాలిస్తున్నా వారు మాత్రం నిర్భయంగా క్లబ్‌లకు చేరుకుంటున్నారు. ఈ విషయం తెలియని పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు. నిబంధనలు హుష్ ‘కాకి’ రిక్రియేషన్ పేరుతో ఏర్పాటైన ఈ క్లబ్బులో సరిపోను పార్కింగ్తో విశాలమైన ఆవరణ ఉండాలి క్లబ్ సభ్యత్వం ఇచ్చే సమయంలో వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. క్లబ్లో జిమ్, యోగ, స్విమ్మింగ్పూల్లతో పాటు అవుట్డోర్ లేదా ఇండోర్ గేమ్స్ సదుపాయాలుండాలి. కోర్టు అనుమతితో కేవలం 13 ముక్కలతో కూడిన పేకాట(స్కిల్డ్గేమ్) మాత్రమే ఆడాలి. ముందస్తు అనుమతి లేకుండా నాన్‌మెంబర్స్‌ను అనుమతించరాదు కానీ పై నిబంధనలు ఏవీ అమలు కావటం లేదు. రిక్రియేషన్‌కు అవసరమైన సౌకర్యాలు లేకుండానే ఒక్క పేకాటనే నిర్వహిస్తున్నారు. కానీ యంత్రాంగం మాత్రం ఆర్నెళ్లకు ఒక మారు చుట్టపుచూపులా దాడులు చేసి తాత్కాలికంగా మూసేస్తున్నారు. మూడు రోజులకే నిర్వాహకులు తిరిగి వాటిని ప్రారంభించటం నగరంలో ఆనవాయితీగా మారింది. -
సినిమా కష్టాలు
సాక్షి, నరసరావుపేట: ప్రతి ఒక్కరికి సినిమా అనేది ఓ వినోదం. వారంతమో లేక ఆటవిడుపుగానో మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు తమ కష్టాలను మర్చిపోవడానికి కుటుంబ సమేతంగా సినిమాలకు వెళుతుంటారు. గుంటూరు నగరంతోపాటు, జిల్లాలోని చిన్నచిన్న పట్టణాల్లో ఎలాంటి మెరుగైన రిక్రియేషన్ క్లబ్‌లు కానీ, పార్కులు కానీ లేకపోవడంతో ప్రజలు సేదతీరడానికి, కాలక్షేపం చేయడానికి సినిమా మినహా వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. ఇది ప్రజల తప్పనిసరి అవసరంగా మారింది. దీన్ని సినిమా థియేటర్ల నిర్వాహకులు పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు నలుగురు కలిసి సినిమాకు వెళితే రూ. 600లు కచ్చితంగా ఖర్చు కావాల్సిందే. సినిమాకు వెళ్తే జేబులకు చిల్లు పడుతుండటంతో మధ్యతరగతి, పేద ప్రజలు నెలకు ఒక సినిమా కూడా చూడలేక పోతున్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం నామమాత్రంగానైనా సౌకర్యాలు, వసతులు కల్పించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ డబ్బులు దండుకుంటున్నారు. వినోదం కోసం సినిమాకు వెళ్లిన ప్రజలు కష్టాలపాలవుతున్నారు. గుంటూరు నగరంలో సుమారు 25 సినిమా థియేటర్లు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 100 వరకు ఉన్నాయి. సినిమా హాళ్లల్లో వసతులు, సౌకర్యాలపై తరచూ సమీక్షిస్తుండటం, ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తే స్పందించి చర్యలు తీసుకోవడం, టికెట్ల విషయం, క్యాంటిన్లో తినుబండారాలు, సినిమా హాళ్లల్లో పారిశుధ్యం నిర్వహణ, వాహనాల పార్కింగ్ ధరలు ఇలా అన్ని అంశాలపై ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే ఇవి జిల్లాలో ఎక్కడా మచ్చుకైనా అమలు కావడం లేదు. అదే రీతిలో ఉన్నతాధికారులు సమీక్షించిన దాఖలాలు కూడా లేవు. గుంటూరు నగరంలో అత్యధిక శాతం సినిమా హాళ్లు ఏసీ కలిగి ఉన్నాయి. ముఖ్య పట్టణాల్లో ఉన్న సినిమా హాళ్లలో సైతం కొన్ని ఏసీ ఉన్నాయి. అయితే వీటిలో అధికశాతం హాళ్లలో ఏసీలు పనిచేయకపోవడం, సరైన సీటింగ్ వసతి లేకపోవడం ఇలా సమస్యలు కోకోల్లలు. ప్రధానంగా కొత్త సినిమా రిలీజ్ అయితే హాలు యజమానులే బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మించి లాభపడుతున్నారు. దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. నిబంధనలకు అనుగుణంగా టికెట్ల ధరలు ఉండవు, రెట్టింపు ధరలకు అమ్ముతుంటారు. సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అంటే అదీ లేదు. బైక్ పార్కింగ్‌కు రూ. 15లు వసూలు చేస్తున్నారు. థియేటర్ లోపల సినిమా మొదలవగానే వేసిన ఏసీ ఇంటర్వెల్ తరువాత ఏ హాలులో పనిచేయదు. అదేమని ప్రేక్షకుడు ప్రశ్నిస్తే సినిమా చూస్తే చూడు లేకపోతే పో అని బెదిరించడం సర్వసాధారణమే. ఇక తినుబండారాల విషయానికొస్తే క్యాంటిన్ రేట్లు నింగినంటుతాయి. ప్రతిదానిపై సగటున రూ. 3 నుంచి రూ. 10 ల వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు. అంత ధర తీసుకున్నా నాణ్యమైన ఆహారాన్ని మాత్రం అందించరు. చిన్న పిల్లల కోసమని వారి కుటుంబ సభ్యులు ఏదైనా ఆహారం తీసుకెళితే వారిపై ధ్వజమెత్తి నానా హంగామా చేసి తీసుకెళ్లిన పదార్థాలను బయట పారవేయి ంచడం, లేదా, బయట తిన్న తరువాత లోనికి అనుమతించడం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి సినిమా హాలులో అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, ఆహార పదార్థాల విక్రయాలపై రెవెన్యూ యంత్రాంగంతో పాటు నగరపాలక సంస్థ, అగ్నిమాపక , కార్మిక, తూనికలు కొలతల విభాగం తదితర శాఖలన్నీ పర్యవేక్షిస్తుండాలి. కానీ ఆయా శాఖల అధికారులు కొత్త సినిమా టికెట్లు తీసుకుని చూసీచూడనట్లు పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. సినిమాహాళ్లపై ఫిర్యాదులుఅందుతున్నాయని నరసరావుపేట ఆర్డీఓ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలుపాటించాలని ఇప్పటికే యాజమాన్యానికి చెప్పామని, వారితో సమావేశాలు నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తామని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న థియేటర్లను సీజ్ చేస్తామని చెప్పారు.