పేదింట్లో వెలగాలి విద్యాదీపాలు

Mana Palana Mee Suchana: CM YS Jagan Review On Education Sector - Sakshi

‘మన పాలన–మీ సూచన’ విద్యారంగంపై సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌

చదువులకు చేసే ఖర్చంతా నా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే

ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి

అందుకే విద్యారంగంలో సమూల సంస్కరణలు, విప్లవాత్మక పథకాలు

ఆగస్టు 3న స్కూళ్లు పునఃప్రారంభం రోజే ‘జగనన్న విద్యా కానుక’

నాడు–నేడు తొలివిడత స్కూళ్లలో జూలైకి 9 రకాల సదుపాయాలు

దేశంలో ఎక్కడా లేని విధంగా ‘అమ్మ ఒడి’ 

ఒకేసారి 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,350 కోట్లు జమ

పిల్లల భోజనం మెనూపై ఏ సీఎం కూడాఆలోచించని విధంగా చేశాం

ఇక నేరుగా తల్లుల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు

నన్ను చాలా మంది అంటున్నారు. అమ్మ ఒడిలో అన్ని డబ్బులు పెడుతున్నానని, నాడు–నేడుకు ఇంత ఖర్చు పెడుతున్నానని, ఫీజు రీయింబర్స్‌ మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన అంటున్నానని, ఇంతింత డబ్బు ఖర్చు పెడుతున్నానని అన్నారు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే... నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడుతున్నా.

పేదవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడంటే.. ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ కావాలి. అప్పుడు వారు మంచి ఉద్యోగం చేసి ఎంతో కొంత పంపితే ఆ కుటుంబాలు బాగుపడి  పేదరికం నుంచి బయటపడతాయి. వారి జీవితాలు బీపీఎల్‌ నుంచి మధ్య తరగతికి ఎదుగుతాయి. అలా చదివించలేకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ పేదరికంలోనే ఉండిపోతారు. పేదరికానికి ఏకైక పరిష్కారం ఉన్నత విద్య. దిస్‌ ఈజ్‌ వాట్‌ ఛేంజ్‌ ది లైఫ్‌ ఆఫ్‌ పీపుల్‌.

పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటారు. అందుకే మధ్యాహ్న భోజనంలోనూ సమూల మార్పులు చేశాం. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ రోజుకో వెరైటీతో మెనూ అమలు చేస్తున్నాం.

నా పాదయాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగుతుండగా ఓ ఇంటి ముందు ఒక పిల్లవాడి ఫ్లెక్సీ ఉంది. ఆ ఇంటి యజమాని గోపాల్‌ నన్ను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంజనీరింగ్‌ చదివే కుమారుడు ఫీజులు కట్టేందుకు తండ్రి పడే కష్టాన్ని చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు, ఆ తండ్రి బాధను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదీ గత ప్రభుత్వ హయాంలో విద్యా రంగం పరిస్థితి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని ప్రతీ పేద ఇంట్లో చదువుల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, నాడు–నేడు పథకాలపై వెచ్చిస్తున్న ఖర్చంతా మన పిల్లల భవిష్యత్తు కోసం తాను పెడుతున్న పెట్టుబడిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే వెలకట్టలేని ఆస్తి చదువు మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో  ఏటా రూ.15 వేలు జమ చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరికీ ఈ ఏడాది మార్చి 31 వరకు ఫీజులు పూర్తిగా చెల్లిస్తూ ఒకేసారి రూ.4,200 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,880 కోట్లు కూడా చెల్లించామని చెప్పారు. ‘మన పాలన–మీ సూచన’లో భాగంగా బుధవారం మూడోరోజు విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మేధోమథన సదస్సు నిర్వహించారు.  విద్యారంగ నిపుణులు, విద్యార్ధులు,  తల్లిదండ్రులు, లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం వివరాలివీ..

పాదయాత్రలో స్వయంగా చూశా..
మా ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు విద్యా రంగం ఎలా ఉండేదో గమనిస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితులు కనిపించాయి. ఎన్నికల ముందు సుదీర్ఘంగా సాగిన నా పాదయాత్రలో చాలా మంది చిన్నారులు నాతో కలిసి అడుగులు వేశారు. అక్టోబర్, నవంబర్‌ వరకు కూడా వారికి పుస్తకాలు అందలేదని తెలిసింది. మధ్యాహ్న భోజన పథకం ఆయాలు చాలా మంది ఏడెనిమిది నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని, రూ.1,000 గౌరవ వేతనాలు కూడా చెల్లించడం లేదని చెప్పినప్పుడు ఆవేదన చెందా.

అధ్వాన స్థితిలో స్కూళ్లు
నాడు అధ్వాన పరిస్థితిలో స్కూళ్లున్నాయి. బాత్‌రూమ్‌లు లేవు. ఒకవేళ ఉన్నా నీళ్లు రావు. పాఠశాలల భవనాలు బాగు చేయాలన్న ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వానికి లేదు. టీచర్లు ఎంత మంది ఉండాలో స్పష్టత లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల వైపు చూడకుండా ఖర్చు ఎక్కువైనా సరే పిల్లలను ప్రైవేట్‌  స్కూళ్లలోనే చేర్పించాలని తల్లిదండ్రులు భావించే పరిస్థితి ఉండేది. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ఉంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం తెలుగు మీడియంలోనే ఉన్నాయి.
మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా విద్యారంగంపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సదస్సుకు హాజరైన విద్యార్థులు, తల్లి దండ్రులు, టీచర్లు, విద్యారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు 

కాంపిటేటివ్‌గా ఉండాలి
పిల్లలు చదవాలి అంటే కాంపిటేటివ్‌గా ఉండాలి. ముఖ్యంగా పేద పిల్లలు కాంపిటేటివ్‌గా ఉండాలి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లలో మెసేజ్‌లు అన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటున్నాయి. డ్రైవర్లు లేని కార్లు కూడా రానున్నాయి. మన కళ్ల ముందే ఇవన్నీ కనిపిస్తున్నా కొందరు ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం వద్దంటున్న ఈ పెద్దమనుషులు ఎవరూ వాళ్ల పిల్లలను తెలుగు మీడియం స్కూళ్లకు పంపడం లేదు. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్నారు. ఈ కాంపిటేషన్‌లో పేదవాడు బతకాలంటే, తమ కాళ్ల మీద తాము బతికే పరిస్థితి రావాలంటే వారికి మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువు మాత్రమే. 

ఇంటర్‌తోనే ఆగిపోతున్నారు..
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యులు 33 శాతం ఉండగా దేశంలో 27 శాతం మంది ఉన్నారు. ఇంటర్‌ తర్వాత ఎంత మంది పిల్లలు ఇంజనీరింగ్‌ లాంటి కోర్సుల్లో చేరుతున్నారో ఇతర దేశాలతో పోల్చినప్పుడు.. బ్రిక్స్‌ దేశాల జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) చూస్తే రష్యాలో 82 శాతం ఎన్‌రోల్‌ అవుతుండగా, బ్రెజిల్‌లో 51 శాతం, చైనాలో కూడా దాదాపు అదే శాతం ఎన్‌రోల్‌ అవుతుండగా, భారత్‌లో మాత్రం కేవలం 25.8 శాతం మంది మాత్రమే ఎన్‌రోల్‌ అవుతున్నారు. అంటే 74 శాతం విద్యార్థులు అక్కడితోనే చదువు ఆపేస్తున్నారు. చదవడం ఇష్టం లేక కాదు, కేవలం తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చదువు మానిపిస్తున్నారు.

స్కూళ్ల స్వరూపం మారుస్తాం
రాష్ట్రంలో 47,656 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలున్నాయి. నాడు–నేడు కార్యక్రమం ద్వారా తొలివిడతగా 15,715 స్కూళ్ల రూపు రేఖలు జూలై నాటికల్లా మారుస్తాం. ప్రతి స్కూల్‌లో టాయిలెట్లు, మంచినీరు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ (కొత్త బల్లలు), పెయింటింగ్‌ ఫినిషింగ్, ప్రహరీ, ఇంగ్లిష్‌ మీడియం ల్యాబ్‌ లాంటి 9 రకాల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది మరో 15 వేల స్కూళ్లు, కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మిగిలిన వాటి రూపురేఖలు మార్చబోతున్నాం. 

అమ్మ ఒడి
ఇవన్నీ చేస్తూ నిరుపేద కుటుంబాలు పిల్లలను బడికి పంపించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో  రూ.6,350 కోట్లు జమ చేశాం. అప్పుడు అమ్మలకు ఒక మాట చెప్పా. వచ్చే ఏడాది కూడా ఈ మొత్తాన్ని తీసుకోవాలంటే పిల్లలకు కనీసం 75 శాతం హాజరు ఉండాలని చెప్పా. వచ్చే ఏడాది కూడా జనవరి 9న అమ్మ ఒడి డబ్బులిస్తాం.

పారశాలలు తెరిచే రోజే విద్యా కానుక
పిల్లలు ఇంకా బాగా చదవాలని ఆగస్టు 3న పాఠశాలలు తెరిచే రోజే జగనన్న విద్యా కానుక ఇస్తున్నాం. స్కూల్‌ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్టు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ ఇస్తాం. దీనికి దాదాపు రూ.660 కోట్లు ఖర్చవుతున్నా వెనుకాడకుండా అమలు చేస్తున్నాం. 

పిల్లలకు పౌష్టికాహారం
పిల్లలు స్కూల్‌ను ఇష్టపడాలంటే అందించే ఆహారం కూడా బాగుండాలి. మధ్యాహ్న భోజనం ఆయాల జీతాన్ని రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచాం. వారి జీతాలు, సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్‌ చానల్‌లో పెట్టించాం. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే మెనూపై గతంలో ఏ సీఎం కూడా ఆలోచించని విధంగా నేను ఆలోచన చేస్తే విద్యాశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు 20 రోజులు కసరత్తు చేసి మెనూ ఖరారు చేశాం. డైటీషియన్లతో కూడా మాట్లాడాం. పులిహోర, వెజిటబుల్‌ రైస్, బెల్లం పొంగలి, కిచిడీ, చిక్కీలు ఇస్తూ జగనన్న గోరుముద్దను జనవరి 21న ప్రారంభించాం. దీనికోసం అదనంగా ఏటా రూ.425 కోట్లు ఖర్చయినా అమలు చేస్తున్నాం.

మండలానికో జూనియర్‌ కాలేజీ
పిల్లలు ఇంటర్‌ తర్వాత చదువుకునేందుకు మండలానికి కనీసం ఒక జూనియర్‌ కాలేజీ కూడా లేదని తెలియడంతో ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్చాలని నాడు–నేడులో చేర్చాం.

పూర్తి ఫీజుల చెల్లింపు
గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెంచడం కోసం ప్రక్షాళన చేపట్టాం. అందులో  భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం రూ.1,880 కోట్లు బకాయి పెట్టింది. దీంతో పాటు ఈ ఏడాది మార్చి 31 వరకు ఒకేసారి దాదాపు రూ.4,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం. దీనివల్ల 10 లక్షల మంది బీసీలకు రూ.1,800 కోట్లు, 4లక్షల మంది ఎస్సీలకు రూ.800 కోట్లు, 80 వేల మంది ఎస్టీలకు రూ.130 కోట్లు, 1.45  లక్షల మంది మైనారిటీలకు రూ.300 కోట్లకు పైగా లబ్ధి కలిగింది. 3.5 లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులకు  రూ.1,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం. బకాయి పడిన పిల్లలతో కలిపి చూస్తే దాదాపు 19 లక్షల మందికి రూ.4,200 కోట్లు ఫీజుల కోసం చెల్లించాం.

ఇక తల్లుల ఖాతాల్లోనే...
వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి త్రైమాసికం పూర్తి కాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తం జమ చేస్తాం. అప్పుడు ఆ తల్లి కాలేజీకి వెళ్లి వసతులు పరిశీలించి విద్యా బోధనపై ఆరా తీశాకే ఫీజులు చెల్లించాలి. అవి సరిగా లేకపోతే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. వచ్చే సెప్టెంబర్‌ నుంచి ఈ విద్యా దీవెన కార్యక్రమం ఉంటుంది. నేనే స్వయంగా ఏడాదికి నాలుగు సార్లు తల్లులతో మాట్లాడి డబ్బులు విడుదల చేస్తా.

వసతి దీవెన
వసతి దీవెన ద్వారా కాలేజీల్లో చదివే పిల్లలకు హాస్టల్, మెస్‌ చార్జీల కింద ఏటా రూ.20 వేల వరకు ఇస్తాం. ఇది రెండు దఫాల్లో తల్లుల ఖాతాల్లో వేస్తాం. తొలిదఫా రూ.10 వేలు జనవరి, ఫిబ్రవరిలో.. మిగిలిన రూ.10 వేలు సెప్టెంబరులో తల్లుల ఖాతాల్లో వేస్తాం.

 చదువు కాగానే ఉపాధి
చదువు పూర్తయ్యే సరికి ఉపాధి లభించేలా ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నాం. కోర్సులు యథావిధిగా ఉంటాయి. చివరి సెమిస్టర్, వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.

వైఎస్సార్‌ కంటి వెలుగు
ఈ ఏడాది నాకు చాలా సంతోషం కలిగించిన పని.. ‘వైఎస్సార్‌కంటి వెలుగు’. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశాం. 1.58 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం కాగా ఇప్పటికే 1.29 లక్షల మందికి పంపిణీ చేశారు. త్వరలోనే మిగతావి కూడా పంపిణీ చేస్తారు. స్కూళ్లు తెరిచిన తర్వాత 46 వేల మంది పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తుంది.కార్యక్రమంలో మంత్రులు సురేష్, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌ నీలం సాహ్ని, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు

‘కార్పొరేట్‌’తో పోటీ పడతాం
ఆంగ్ల భాషను నేర్చుకోవడం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంది. మాతృభాషను కంటితో పోల్చితే ఇంగ్లిష్‌ కళ్లజోడు లాంటిది. దీని సహాయంతో మరింత బాగా చూడగలం. ఇంగ్లిష్‌ నేర్చుకోవడం వల్ల మాలాంటి పేద విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్లలో చదివే వారితో పోటీపడగలుగుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇంగ్లిష్‌ మీడియం తెచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మా మేనమామగా మీరు పక్కనుంటే గెలుపు మాదే.    
– కె.గౌతం, పదో తరగతి, జెడ్పీహెచ్, నిడమానూరు

తరతరాలకూ గుర్తుంటారు..
అన్నా.. నాకు ముగ్గురు ఆడపిల్లలు. కన్నది మేమే అయినా వారిని మేనమామలా ఆదుకుంటున్న మీకు ధన్యవాదాలు.  అమ్మ ఒడి డబ్బులు రాగానే సుకన్య పథకం కింద ఇద్దరికీ చెరొక ఐదు వేల రూపాయలు డిపాజిట్‌ చేశాం. తరతరాలకూ మీ పేరు చెప్పుకుంటాం. మా ఆయుష్షు కూడా పోసుకుని మీరు నిండు నూరేళ్లూ జీవించాలి.    
– కె.సరిత, విద్యార్థినుల తల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top