కుటుంబం అండతోనే పైశాచిక క్రీడ | Man Arrested For Raping Minor Girl In Vsakhapatanam | Sakshi
Sakshi News home page

కుటుంబం అండతోనే పైశాచిక క్రీడ

Aug 21 2019 7:17 AM | Updated on Aug 21 2019 7:19 AM

Man Arrested For Raping Minor Girl In Vsakhapatanam - Sakshi

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉదయ్‌ భాస్కర్‌

అభం శుభం తెలియని చిన్నారి అన్న ఇంగిత జ్ఞానం లేదు.. పక్కంట్లోనే ఉంటున్న బాలికన్న విచక్షణ అంతకంటే లేదు.. కళ్లను, బుద్ధిని కప్పేసిన కామపు పొరలు అతగాడిని కామ పిశాచిగా మార్చేశాయి. ఈ పిశాచికి అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులే వెన్నుదన్నుగా నిలిచి నిస్సిగ్గుగా పైశాచిక క్రీడకు సహకరించడం సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. గోపాలపట్నం నేతాజీనగర్‌లో కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన ఈ అమానవీయ ఘటనలో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడితో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ దారుణం గురించి పోలీసులు అందజేసిన వివరాలు విభ్రాంతికి గురి చేశాయి. ఏడాదిపాటు బాలికను లైంగికంగా హింసించడం, నెల తప్పడంతో మందులు ఇప్పించడం, అబార్షన్‌ చేయించడం.. ఈ క్రమంలో దుష్కృత్యం వెలుగులోకి రావడంతో నిందితుడు తాను పరారు కావడమే కాకుండా బాలికను అనకాపల్లికి తీసుకెళ్లిపోయి.. స్నేహితుడి ఇంటి వద్ద ఉంచడం.. ఇలా వరుసగా జరిగిన ఘటనలు నేర ప్రవృత్తి ఎంతగా పెరిగిపోయిందో స్పష్టం చేస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఓ ప్రబుద్ధుడు పక్కింటి బాలికపై కన్నేశాడు... మాయమాటలతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు... ఈ పైశాచికాన్ని కప్పిపుచ్చేందుకు భార్య, మేనత్త, స్నేహితుల సహకారంతో బాలికకు అబార్షన్‌ చేయించాడు. అయితే విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. నింది తుడు పైపిల్లి రవికుమార్‌ సహా ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ ఉదయ్‌ భాస్కర్‌ బిల్లా తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడిపై 376, 342, 313 సెక్షన్‌లతోపాటు ఫోక్సో యాక్ట్‌ అమలు చేసినట్లు తెలిపారు. బాలిక అబార్షన్‌ వ్యవహారంపై ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేజీహెచ్‌ వైద్యులను విచారిస్తామని తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం... గోపాలపట్నం నేతాజీనగర్‌కు చెందిన పైపిల్లి రవికుమార్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.

అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తన ఇంటి పక్కనే నివా సం ఉంటున్న బాలిక (14) ఇంటికి ఏడాదిన్నర నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఆమెతో రవికుమార్‌కు చనువు పెరిగింది. ఇదే అదునుగా భావించి బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. అలా ఏడాది నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఆందోళనకు గురైన నిందితుడు గర్భస్రావం కోసం ఆమె కు మాత్రలు వేయించాడు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే గోపాలపట్నంలోని 30 పడకల ఆస్పత్రికి తరలించాడు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్థానిక వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి ఈ నెల 7న 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించాడు. అక్కడి వైద్యులు బాలిక గర్భవతి అని తెలిసినప్పటికీ పోలీసులకు ప్రాథమిక సమాచారం కూడా అందించకుండానే వైద్యం చేశారు. ఇంతలో విషయం బయటకు పొక్కడంతోపాటు గోపాలపట్నంలో సంచలనంగా మారడంతో బాలిక ఆరోగ్యం మెరుగుపడి కోలుకున్న తర్వాత ఈ నెల 15న కేజీహెచ్‌ నుంచి అనకాపల్లిలోని స్నేహితుడి ఇంటికి తరలించాడు. బాలికతోపాటు ఆమె తల్లిని కూడా గృహ నిర్బంధంలో ఉంచాడు.

నాయనమ్మ ఫిర్యాదుతో వెలుగులోకి... 
కామాంధుడి అఘాయిత్యంపై గోపాలపట్నంలో తీవ్ర చర్చ జరగడంతోపాటు పత్రికల్లోనూ వార్తలు ప్రచురితం కావడంతో బాలిక నాయనమ్మ ధైర్యం తెచ్చుకుని గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించింది. నేతాజీనగర్‌కు చెందిన రవికుమార్‌ తన కోడలు, మనమరాలిని కిడ్నాప్‌ చేశాడని ఫిర్యాదు చేసింది. దీనిపై గోపాలపట్నం సీఐ రమణయ్య నేతృత్వంలో రెండు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. బాలికపై అత్యాచారం, అనంతరం అబార్షన్‌ చేయించడం వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. బాలికను, ఆమె తల్లిని గృహ నిర్బం ధం నుంచి విడిపించారు. నిందితుడు రవికుమార్‌తోపాటు అతడికి సహకరించిన భార్య, మేనత్త, మరో ముగ్గురు స్నేహితులను అరెస్ట్‌ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు డీసీపీ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. సమావేశంలో వెస్ట్‌ ఏసీపీ స్వరూపరాణి, గోపాలపట్నం సీఐ పి.రమణయ్య పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement