అనుమానం పెనుభూతమై.. | Man allegedly kills wife with cricket bat in Pendurthi | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Oct 14 2017 5:29 PM | Updated on Oct 14 2017 5:29 PM

Man allegedly kills wife with cricket bat in Pendurthi

పెందుర్తి:  కట్టుకున్న భార్యపై అనుమానం పెనుభూతమైంది. చివరకు కాలయముడైన భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. పెందుర్తి నడిబొడ్డున సంచలనం రేపిన ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెందుర్తిలోని యాతపేటకు చెందిన మునస మహాలక్ష్మినాయుడు, రాజరాజేశ్వరి(38) దంపతులు పాతూరులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. మహాలక్ష్మినాయుడు ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా రాజరాజేశ్వరి గాజువాకలోని బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుంది. కొన్నాళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. తరచూ అనుమానాలతో భార్యాభర్తలకు గొడవలు జరిగేవి.

 ఈ క్రమంలో శుక్రవారం వీరి మధ్య ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. మాటమాట పెరిగి క్షణికావేశానికి గురైన మహాలక్ష్మి భార్య రాజరాజేశ్వరి తలపై ఇంట్లో ఉన్న క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టాడు. కుప్పకూలిపోయిన రాజేశ్వరి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజరాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరి సంతానం కుమార్తె శ్వేత డిగ్రీ, కుమారుడు సాయి ఇంటర్మీడియెట్‌ చదువుతున్నారు. పెందుర్తి సీఐ జె.మురళీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement