
సాక్షి, న్యూఢిల్లీ: రూ.53,039 కోట్ల విలువైన పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాల స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. ఈ కుంభకోణానికి కాగ్ నివేదికే సాక్ష్యమని పేర్కొన్నారు. 53,539 కోట్ల ఖాతాల ద్వారా రూ.53,038 కోట్లు డిపాజిట్ చేసి.. రూ.51,448 మేర థర్డ్ పార్టీ ఖాతాలకు బదిలీ చేశారని వివరించారు. చెల్లింపులు ఎవరికి చేశారో సంబంధిత వివరాలు ఆర్థిక శాఖ సమర్పించలేదని కాగ్ తన నివేదికలో ప్రస్తావించినట్టు వివరించారు. ఈ చెల్లింపులకు నిజమైన లబ్ధిదారులెవరో బయటపడుతుందన్న భయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందన్నారు. 63 సెల్ఫ్ చెక్‌ల ద్వారా రూ.258 కోట్ల మేరకు నగదు ఉపసంహరణ జరగడం అనుమానాలకు తావిస్తోందని స్వయంగా కాగ్ పేర్కొన్నట్టు ఈ లేఖలో జీవీఎల్ వివరించారు.
ఇది ప్రజాధనాన్ని వ్యవస్థీకృతంగా దోచుకోవడమేనని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకపోయి ఉంటే కాగ్ ఆడిటింగ్‌కు సమాచారాన్ని ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బిహార్‌లోని దాణా కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్‌లోని పీడీ స్కామ్ పెద్దదని పేర్కొన్నారు. సరైన సమయంలో బిహార్ గవర్నర్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించడంతో దాణా కుంభకోణంలో దోషులకు శిక్ష పడిందని గుర్తుచేశారు. బిహార్‌లో కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టుగానే.. తాము నిజాయితీపరులమని చెప్పిందని గుర్తుచేశారు. అందువల్ల గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించి ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని.. ఈ కుంభకోణంలో నిజమైన లబ్ధిదారులు ఎవరో తేలాలంటే ముందుగా 2016 –17కు సంబంధించి పీడీ ఖాతాలపై ప్రత్యేక కాగ్ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు.