‘కూలి’పోతోంది

mahatma gandhi national employment guarantee scheme

సాక్షి, రాజమహేంద్రవరం: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో పని చేస్తున్న కూలీల కష్టానికి సకాలంలో ఫలం దక్కడం లేదు. ఉపాధి లేని సమయంలో పేదలకు పనులు చూపించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జిల్లాలో ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పని చేసిన వారం కూలి డబ్బు మరో వారం తిరిగేకల్లా రావాల్సి ఉండగా జిల్లాలో రెండున్నర నెలలుగా అందడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.52 కోట్ల మేర బకాయిలు పెడుతూ ‘ఇదిగో అదిగో’ అంటూ క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్న మాటలతో బడుగుజీవులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వీరి వెతలకు అండగా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన రాజానగరం నియోజకవర్గంలో ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరంలో కూలీలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో అనూహ్య స్పందన రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుడుతున్నారు.

బకాయిలతో తగ్గిపోతున్న కూలీల సంఖ్య...
ఆ వారంలో చేసిన మస్తర్లను అధికారులు వారాంతంలో నమోదు చేస్తున్నారు. వారం రోజుల కూలి డబ్బు మరో వారం తిరిగే కల్లా కూలీల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. జిల్లాలో 6.5 లక్షల కుటుంబాలకు ఉపాధి జాబ్‌ కార్డులు జారీ చేశారు. ఇందులో గడచిన ఆరు నెలల్లో 3.61 లక్షల కుటుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొన్నాయి.  2017–18 ఆర్థిక సంవత్సరంలో 1,86,75,000 పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల 11వ తేదీ వరకు 1,38,73,000 పని దినాలు కల్పించారు. ఇందుకుగాను రూ.225 కోట్లు కూలీలకు చెల్లించాల్సి ఉండగా రూ.173 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. జూలై ఆఖరి వారం నుంచి రెండున్నర నెలలుగా రూ.52 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి.

బ్యాంకుల ముందు పడిగాపులు...
గతంలో పోస్టాఫీసుల ద్వారా జరిగే ఉపాధి కూలీ నగదు చెల్లింపులు 2014 నుంచి కూలీల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. బ్యాంకు ఖాతా తీసుకున్న తర్వాతే కొత్తగా జాబ్‌ కార్డులు జారీ చేస్తున్నారు. కూలీల బ్యాంకు ఖాతాలకు వారి ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధనతో కూలీలకు కొత్త సమస్యలు వచ్చాయి. రెండు మూడు ఖాతాలున్న వారు అధికారులకు ఒక ఖాతా నంబరు ఇచ్చి బ్యాంకులో మరో ఖాతాకు తమ ఆధార్‌ నంబర్‌ను ఇవ్వడంతో సమస్య జటిలమవుతోంది. ఆధార్‌ నంబర్‌ అనుసంధానం కాలేదని అధికారులు చెబుతుండగా, తాము బ్యాంకులో ఇచ్చామని కూలీలు వాపోతున్నారు. ఆధార్‌ అనుసంధానం కాని కూలీలకు ఐదారు నెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. అందుకు సంబంధించిన నగదు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనా అధార్‌ అనుసంధాన సమస్యతో కూలీలకు చేరడంలేదు. ఫలితంగా నగదు కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కేంద్ర బృందం పర్యటించినా ఫలితం శూన్యం...
జిల్లాలో ఉపాధి హామీ పనుల తీరు పరిశీలించేందుకు గత నెల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఏజెన్సీ, ఆ తర్వాత మెట్ట ప్రాంతంలో ఉపాధి పనులు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించింది. ఆ సమయంలో కూలీలు తమకు గతంలోలాగే పోస్టాఫీసుల ద్వారా నగదు చెల్లించాలని విన్నవించుకున్నారు. పనులు మానుకుని వారానికి ఓ రోజు పట్టణాల్లోని బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. గ్రామంలో ఉండే పోస్టాఫీసయితే రోజులో ఏదో ఒక సమయంలో వెళ్లి కూలీ డబ్బులు తెచ్చుకుంటామని కేంద్ర బృందానికి విన్నవించారు. ప్రతి వారం డబ్బులు చెల్లించాలని విన్నవించినా పరిస్థితి మారలేదు.

వారంలో బకాయిల చెల్లింపులు
జిల్లాలో రెండున్నర నెలలుగా ఉపాధి కూలీల నగదు బకాయిలు ఉన్నాయి. ఏ వారానికి ఆ వారం మేము బిల్లులు పంపిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. వారంలో వస్తాయని మాకు సమాచారం ఉంది. బ్యాంకు ఖాతాతో ఆధార్‌ లింకేజీ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. సమస్యను పరిష్కరించేందుకు గత నెల నుంచి మండల అభివృద్ధి అధికారికి అధికారాలిచ్చాం. కంప్యూటర్‌ ఆపరేటర్లకు గత నెల 27, 28 తేదీల్లో ఈ విషయంపై శిక్షణ ఇచ్చాం. కూలీల ఆధార్‌ లింకేజీ సమస్య ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాం.
– జి.రాజకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా

మొక్కలు నాటి ఏడావుతోంది...
మొక్కలు నాటి ఏడాదవుతోంది..ఇంతవరకు కూలీ ఇవ్వలేదు, ఎప్పుడు అడిగినా అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందంటున్నారేగాని కూలీ మాత్రం ఇవ్వడం లేదు. కూలీ ఇవ్వని పనికెందుకని ఉపాధికి పనికి పోవడం మానేశాను.
– మేడిద శ్రీరాములు, రాధేయపాలెం, రాజానగరం మండలం.

రెండు నెలల కూలీ రాలేదు
బోదెలు పని చేశాం. రెండు నెలలవుతోంది. అధికారులను అడిగితే పై నుంచి డబ్బులు రాలేదని చెబుతున్నారు. కూలీ లేకపోతే మేము ఏం తినాలి. ఏం తాగాలి. అప్పులు చేసి తిని పనికి వెళుతున్నాం. డబ్బులు ఎప్పటికప్పుడు వస్తే మాకు ఇబ్బందులుండవు.
– బి.ప్రేమ్‌ శేఖర్, ఉపాధి కూలీ,
రంపచోడవరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top