
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారించాలని రాష్ట్రాలకు సూచన
ఇప్పటికే తాత్కాలిక విచారణ నివేదికలు సమర్పించిన నాలుగు రాష్ట్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్)లో ‘అధిక ఖర్చు’గా గుర్తించిన పనులపై రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరపాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఆడిట్లు, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్లు నిర్వహించిన కేంద్రం, తొలిసారి రాష్ట్రాలే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేయాలని సూచించింది.
ఈ మేరకు ఏప్రిల్‌లోనే రాష్ట్రాలకు ఒక సలహా జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, కొన్ని పనుల్లో ఖర్చులు ఎందుకు ఎక్కువయ్యాయనే విషయంపై విశ్లేషణను కూడా పంపింది. దీనిపై సాంకేతిక, పరిపాలనా అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నివేదికలు సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఈ అంశంపై ఇప్పటికే త్రిపుర, జార్ఖండ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తాత్కాలిక నివేదికలు సమర్పించగా, మిగతా రాష్ట్రాలు స్పందించలేదు. దీంతో జూలై 14, 15 తేదీల్లో జరిగిన 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి పనితీరు సమీక్ష కమిటీ (పీఆర్‌సీ) సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. నివేదికల సమర్పణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిన కేంద్ర అధికారులు, వెంటనే పూర్తి వివరాలతో నివేదికలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
2030 వరకు పథకాన్ని కొనసాగించేలా..
ప్రతీ ఏడాది సుమారు రూ.1 లక్ష కోట్ల వరకు వ్యయం అయ్యే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.86 వేల కోట్ల కేటాయింపులు చేసింది. ఇప్పటివరకు ఈ పథకంపై మొత్తం రూ.11.57 లక్షల కోట్ల వ్యయం చేశారు. కాగా 2006లో యూపీఏ–1 ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా, 2008–09 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేశారు. కరోనా సమయంలో (2020–21) 7.55 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఈ పథకంలో పనిచేసి రికార్డు సృష్టించాయి.
ఆ తరువాత డిమాండ్ క్రమంగా తగ్గుతూ 2024–25 నాటికి 5.79 కోట్ల కుటుంబాలకు పడిపోయింది. ఇక, ఈ పథకాన్ని 2029–30 వరకు కొనసాగించేందుకు రూ.5.23 లక్షల కోట్ల వ్యయంతో కొత్త ప్రతిపాదనను కేంద్రం వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ)కు పంపింది. అయితే.. పశ్చిమ బెంగాల్‌లో 2022 మార్చి నుంచి ఈ పథకం నిలిపివేశారు.