కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
18 నెలల్లోగా సిఫార్సులను సమర్పించనున్న కమిషన్
వేతన కమిషన్‌తో 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
2025–26 రబీ సీజన్‌లో ఎరువులపై రూ. 37,952 కోట్ల సబ్సిడీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 8వ కేంద్ర వేతన కమిషన్ (సీపీసీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, 69 లక్షల మంది పెన్షనర్లకు పింఛన్లు పెరగనున్నాయి. కేంద్ర మంత్రివర్గం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశయ్యింది. 8వ కేంద్ర వేతన కమిషన్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది జనవరిలో 8వ సీపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, తాత్కాలిక సభ్యుడు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.
కమిషన్‌ను ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లోగా తన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సిఫార్సులను రూపొందించే సమయంలో పలు కీలక అంశాలను కమిషన్ దృష్టిలో పెట్టుకోనుంది. ఇందులో భాగంగా దేశంలోని ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి వ్యయం, సంక్షేమ పథకాలకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. సహకారేతర పెన్షన్ పథకాలకు నిధులు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై సిఫార్సుల ప్రభావం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ ఉద్యోగుల ప్రస్తుత జీతాల నిర్మాణం, ప్రయోజనాలు, పని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. తుది సిఫార్సులను సూచించిన తర్వాత కూడా 8వ సీపీసీ తమ పరిధిలోని అంశాలపై మధ్యంతర నివేదికలను సమర్పించే వెసులుబాటు ఉంది.
కమిషన్ సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర ప్రయోజనాలను కమిషన్ సమగ్రంగా పరిశీలిస్తుంది, తగిన మార్పులను సూచిస్తుంది. ఈ కమిషన్‌లో ఐఐఎం(బెంగళూరు) ప్రొఫెసర్ పులక్ ఘోష్ తాత్కాలిక సభ్యుడిగా, పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సభ్యకార్యదర్శిగా వ్యవహరించబోతున్నారు. జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
ఆమె గతంలో పలు ప్రభుత్వ కమిటీలకు సారథ్యం వహించారు. కేంద్ర పాలిత జమ్మూకశ్మీర్ పునర్విభజన కమిషన్ చైర్మన్‌గా సేవలందించారు. ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) ముసాయిదా కమిటీలోనూ పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమెకు అప్పగించిన నాలుగో అతిపెద్ద బాధ్యత వేతన కమిషన్ చైర్‌పర్సన్‌గానే. 7వ వేతన కమిషన్‌ను 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
రబీ సీజన్‌లో ఎరువులకు రాయితీ
మరో కీలకమైన నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025–26 రబీ సీజన్‌లో ఎరువులకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఫాస్ఫరస్, పొటాíÙయం ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ ఇవ్వనుంది. ఎరువుల రాయితీ కోసం రూ.37,952 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది 2025 ఖరీఫ్ సీజన్ బడ్జెట్ కంటే రూ.736 కోట్లు ఎక్కువ అని కేంద్రం స్పష్టంచేసింది. ఫాస్ఫేట్‌పై సబ్సిడీని కిలోకు రూ.43.60 నుంచి రూ.47.96కు, సల్ఫర్‌పై సబ్సిడీని కిలోకు రూ.1.77 నుంచి రూ.2.87కు పెంచారు. రైతులకు సరసమైన, సహేతుకమైన ధరలకు ఎరువులు లభించేలా ఈ సబ్సిడీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే, నైట్రోజన్, పొటాష్ ఎరువులపై రాయితీలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. నైట్రోజన్‌పై రాయితీ కిలోకు రూ.43.02, పొటాషిపై రాయితీ కిలోకు రూ.2.38 చొప్పున లభిస్తుంది.


