జగన్‌ సీఎం అయితే వైఎస్‌ పాలన వస్తుంది 

Magunta Srinivasulu Reddy resigns from TDP, will join YSRCP - Sakshi

ఎమ్మెల్సీ మాగుంట  శ్రీనివాసులురెడ్డి స్పష్టీకరణ 

ఎమ్మెల్సీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  

వైఎస్సార్‌సీపీలో చేరతానని వెల్లడి 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ ఏలేశ్వరం (ప్రత్తిపాడు): రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు మాగుంట ప్రకటించారు.

గురువారం సాయంత్రం ఒంగోలులోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డితో మాగుంట కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి, వదిన మాగుంట పార్వతమ్మలు వైఎస్‌తో కలిసి పనిచేశారన్నారు. వారి వారసుడిగా వైఎస్‌ జగన్‌తో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట చెప్పారు.  

టీడీపీకి ఎమ్మెల్యే వరుపుల రాజీనామా 
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ మరో షాక్‌ తగిలింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు దివంగత నేత వైఎస్సార్‌ రెండుసార్లు, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఒకసారి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేను చేశారన్నారు. ఎటువంటి పదవులు అశించకుండా వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు తదితరులు కూడా వరుపులతో పాటు టీడీపీకి రాజీనామా చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top