అదనంగా 17 వేల వైద్య సిబ్బంది సిద్ధం.. | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కేర్‌ సెంటర్ల సామర్థ్యం పెంచుతున్నాం

Published Fri, Jul 17 2020 7:46 PM

M T Krishna Babu Says Improving Facilities In Covid Care Centres AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులను దృష్టిలో పెట్టుకొని 46198 బెడ్లు సిద్ధం చేసినట్లు కోవిడ్- 19 టాస్క్‌ఫోర్స్‌ నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఈ మేరకు బెడ్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కోవిడ్ సమాచారానికి సంబంధించి 1902 కాల్ సెంటర్ పని 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రాజమౌళిని నియమించిందని.. ఆయనతో పాటు అర్జా శ్రీకాంత్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ కమిషనర్ కన్నబాబు కలిసి పని చేస్తారన్నారు.

ఇక వైరస్‌ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కోవిడ్ కేర్ సెంటర్ల సామర్థ్యం పెంచుతున్నట్లు కృష్ణబాబు తెలిపారు. అక్కడ ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకొనేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. అదే విధంగా కోవిడ్‌ సెంటర్లలో పెట్టే భోజనం, శానిటేషన్, మందులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి తొమ్మిది అంశాలపై ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. (అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్‌)

‘‘ప్రతి కోవిడ్ సెంటర్ నుంచి ప్రతి రోజు 5 నుంచి 6 మంది దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాము. రానున్న రోజుల్లో మెరుగైన సదుపాయాల కోసం 17000 మంది వైద్య సిబ్బందిని అదనంగా సిద్ధం చేశాము. కోవిడ్ వలన చనిపోయిన వారి అంత్యక్రియల కోసం 15000 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన సమయంలో 20 మంది, పెళ్లిళ్లకు 50కు మించి మంది హాజరయ్యేందుకు అనుమతి లేదు. నిబంధనలకు మించి గుమిగుడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు’’ అని కృష్ణబాబు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement