కొక్కొరొకో! కొక్కొరోక్కో.. ఓట్ల కోడి కూసింది! 

Lok Sabha Elections dates announced: Polls to be held from April 11 - Sakshi

సాక్షి. కర్నూలు(కల్చరల్‌) :  ఒరే నర్సీ... గా ఎర్రపుంజును గంప కింద మూసిపెట్టమంటే... మద్దెరంగం మీద అట్ల గాలికిడ్సినవ్‌... దానికి ఎప్పుడు కూయాల్నో ఎప్పుడు నోర్మూసుకోవాల్నో అర్తం గాకుండవుంది... చెప్పాడు పెద్ద మిద్దోల్ల సంజన్న కట్టమింద కూసుంటూ.  
    అవు మామా!... ఏం సెప్ప తరం గాదులే... ఎంత కలికాలం వచ్చింది సూడు మామా! వానకాలంల వాన పడదు. సలి కాలంల సలిపెట్టదు. తెల్లారజామున కోడి కూయదు.. అస్సలు అర్తమే గాకుండ వుంది మామా! వల్లెతో కట్టమింద దుమ్ము దులుపుతూ చెప్పాడు నర్సిములు. 
    అవురా... ఈ ఎర్ర కోడి పుంజు కర్నూలు పెద్దమార్కట్టు కాడ కొనుక్కొస్తివి. అమ్మేతోడు యిది బలే కూస్తది. సరీగ తెల్లారుజామున కూసి గేర్లో అందర్ని నిద్ర లేపుతది అంటే ఏడువందలు పెట్టి కొనుక్కొస్తివి. అది సూస్తే అందురు నిద్దర లేసినంక తెల్లగైనంక కూయబట్టింది... చెప్పాడు సంజన్న.  
    ఏందిరో మామా అల్లుళ్ళు కోడి కూత... కోత అనబట్టినరు. యాడుంది కోడిపుంజు యిక్కడ నాకు సూపియర్రి రేపు అయితారం నాడు కోసి రాగి ముద్దతోని కలిపి తిందం... చెప్పాడు అప్పుడే వచ్చిన పైగేరి పాపన్న.  
    బాగా సెప్పినవ్‌ లేరద. ఏడు వందలు తెచ్చి కొనుక్కొచ్చిన కోడి యాల పొద్దుకు కూసి సావడంల్యా అని మేం బాద పడ్తుంటే నువు కోసి పెట్టమని అడగనీక వచ్చినవ్‌. ఇప్పుడేం పండగ వచ్చిందనిరా? అడిగాడు నర్సిమన్నా.  
    మీగింగా తెలీదా... ఓట్ల పండగొచ్చింది. మొన్న సాయంత్రమే ఎన్నికల కోడి కూసింది. దాని దెబ్బకు నాయకులు కాలుగాలిన పిల్లుల్లెక్క యిజయవాడకు కర్నూల్‌కి తిర్గుతుండరు. మా పెద్దాయనకు టికెట్టు కాయమైందనుకో... ఇంగ నీ కోడిని లేపుకొపోవడమే... చెప్పాడు పాపన్న.  
    బలే జెప్పినవ్‌రా పాపిగా!... ఎవ్వురిని లేపని కోడిని నువ్వు లేపుకోపో! అవునంటరోయ్‌... అదేందిరా ఎన్నికల కోడి కూసింది అని మన రంగరాజు వాల్లింటి కాడ టీవీలో సూసి సెప్తుంటే నేను గూడ యిన్నానులే. అట్ల కాదురా... మన నాటు కోళ్ల లెక్క ఎలచ్చన్లకు గూడ కోళ్ళుంటయా!... అమాయకంగా అడిగాడు సంజన్న.  
    గట్టిగా నవ్వాడు పైగేరి పాపన్న. మామా! ఎలక్షన్‌ కోడి కాదు... ఎలక్షన్‌ కోడ్‌!... కోడ్‌ అంటే ఇంగ ఈ పొద్దు నుండి ఎలక్షన్ల పెచారం, టిక్కెట్లు కరారు జేయడం, నామినేసన్లు ఏస్కోవడం... యివల్ల మొదలు కానీక... యింగ పచ్చజెండా ఊపినట్లన్న మాట... చెప్పాడు పాపన్న.  
    అట్లనా! అట్లయితే ఇంగ వూర్లల్ల టవున్ల ఒకటే తిర్నాల అన్నమాట. ఇంగ నాకు ఓటేయమంటే నాకు ఓటెయ్యమని ఒకర్ని మించి ఒకరు ఎగేసుకోని వస్తరన్నమాట... చెప్పాడు నర్సిములు.  
    అవు నర్సీ!... దీంట్ల కొన్ని జెండాలు పూర మిడిమ్యాలంగ తిర్గుతున్నయిలే... పూర్తి దొమ్మలిర్సుకోని మాదే పెద్ద పార్టీ... గెల్సే పార్టీ అని ఎచ్చులు పడుకుంట వస్తున్నారు... చెప్పాడు సంజన్న.  
    అంతే మామా!... రొండు నెలల్లో ఎవరు బొక్కబోర్ల పడ్తరో... ఎవరు ఎల్లెలకల పడ్తరో తెల్సిపోతాది. సరేపా!... నీ ఏడువందల కోడి సూపిద్దువు గాని అంటూ ముగ్గురూ రచ్చబండ మింద నుండి లేచి నర్సిములు యింటి దారిపట్టారు.   
    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top