లాకప్పా.. లాకరా | lockup or locker | Sakshi
Sakshi News home page

లాకప్పా.. లాకరా

Nov 30 2013 3:19 AM | Updated on Sep 2 2017 1:06 AM

బద్వేలు ట్రెజరీ కార్యాలయంలో కృష్టంరాజు అనే జూనియర్ అకౌంటెంట్ 2010లో విధులు నిర్వహించేవారు.

ఈ ఫొటోలో ఉన్నది బద్వేలు పోలీస్‌స్టేషన్‌లోని లాకప్ గది. అక్కడ టేబుల్‌పై సీల్‌వేసిన ఒక బాక్స్ ఉంది కదూ.. అందులో అక్షరాలా రూ. 25 లక్షలు ఉన్నాయి. ఇదేమిటి లాకప్‌లో దొంగలు, నిందితులు ఉంటారు గానీ రూ.లక్షలు ఉంటాయా అని అనుకుంటున్నారా.. అవును నిజమే.. నెల కాదు రెండు నెలలు కాదు మూడేళ్లుగా రూ. 25 లక్షలు ఉన్న బాక్స్ లాకప్ గదిలోనే మగ్గుతోంది.శుక్రవారం ఈ బాక్స్‌ను కోర్టు స్వాధీనం చేసుకుంది.
 
 బద్వేలు, న్యూస్‌లైన్: బద్వేలు ట్రెజరీ కార్యాలయంలో కృష్టంరాజు అనే జూనియర్ అకౌంటెంట్ 2010లో  విధులు నిర్వహించేవారు.  పలువురు ఉద్యోగులకు చెందిన రుణాలు, పదవీ విరమణ సమయంలో వచ్చిన నగదును చాకచక్యంగా ఇతరుల అకౌంట్లకు మార్పు చేశాడు. కృష్ణంరాజు తల్లి ఈశ్వరి పెన్షనర్‌గా ట్రెజరీ నుంచి పెన్షన్ పొందుతుండేవారు. ఈమె అకౌంట్‌కు రూ.6.37లక్షలు, సుధ పేరుతో ఉన్న అకౌంట్‌కు రూ. 19.28  మళ్లించాడు. అనంతరం మొత్తం రూ.25.65 లక్షలను డ్రా చేసుకుని స్వాహా చేశాడు.
 
 ఐదారు నెలల అనంతరం ఈ విషయం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారించిన పోలీసులు 2010 డిసెంబరులో నిందితుడు కృష్ణంరాజు నుంచి రూ.25.65లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరి, సుధలకు సంబంధం లేదని తేల్చి వారిని కేసు నుంచి తొలగించారు.

 పోలీసులు పంచాయతీ చేసి నిందితుడిని తప్పించేందుకు సహకరించారనే విమర్శలు ఉన్నాయి. నిందితుడిని విలేకరులకు కూడా చూపించకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు రూ.5లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిందితుడితో పాటు నగదును కోర్టులో ప్రవేశపెట్టారు.   
 
 పోలీస్‌స్టేషన్‌లోనే నగదు  ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ నగదుకు సీలు వేసి  పట్టణ పోలీస్‌స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. నిందితుడు మాత్రం కేసు నుంచి తప్పించుకుని మళ్లీ ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. కాగా బద్వేలు పోలీస్‌స్టేషన్‌లోని లాకప్‌లో మూడేళ్లుగా మూలుగుతున్న రూ.25లక్షల నగదు శుక్రవారం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలోని ప్రభుత్వ ఖాతాలో దీనిని జమ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement